కోఠి ఏటీఎం కాల్పులు, దోపిడీ కేసులో క్యాబ్ డ్రైవరే ప్రధాన సూత్రధారి

కోఠి ఏటీఎం కాల్పులు, దోపిడీ కేసులో క్యాబ్ డ్రైవరే ప్రధాన సూత్రధారి
  • రోజూ డ్రైవింగ్​ చేస్తూ పక్కా స్కెచ్​తో రాబరీ

బషీర్​బాగ్, వెలుగు:  కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెల 31న కాల్పులు జరిపి బట్టల వ్యాపారిని దోచుకున్న సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి, యూపీకి చెందిన తయాబ్ త్యాగితో పాటు ఫుర్ఖాన్ అహ్మద్​ను అరెస్ట్ చేశారు. మంగళవారం బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్​లోని సీసీఎస్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాధ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. యూపీకి చెందిన తయాబ్ త్యాగి గతంలో యూపీలో ఒకరిని గన్​తో బెదిరించి జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత 2024లో హైదరాబాద్​కు​వచ్చి ఓలా, ఉబర్​లో కార్ డ్రైవింగ్ గా పనిచేస్తున్నాడు.

రోజు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఉదయం వేళల్లో అబిడ్స్, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులను డిపాజిట్ చేయడాన్ని గమనించాడు. ఈ క్రమంలో తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా దోపిడీకి ప్లాన్ వేశాడు. ఈ విషయాన్ని యూపీలో ఉండే తన అంకుల్ నౌషాద్, వరుసకు సోదరుడు దానిష్ త్యాగికి చెప్పాడు. వాళ్లు యూపీకు చెందిన మరో ముగ్గురు అబిద్, ఫుర్ఖాన్ అహ్మద్ , ఫహీం అహ్మద్​తో దోపిడీ విషయం వివరించి వారిని హైదరాబాద్ కు పంపించారు. సిటీకి వచ్చిన తర్వాత వీరంతా నాంపల్లి, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల వద్ద మూడు రోజులుగా రెక్కీ నిర్వహించారు.

జనవరి 31న కోఠి ఏటీఎం వద్ద కేరళ వ్యాపారి రిన్షాద్​ను తుపాకీతో బెదిరించారు. ఆయన ప్రతిఘటించడంతో ఫుర్ఖాన్ అహ్మద్ కాల్పులు జరపగా, రిన్షాద్ కాలుకు గాయమైంది. అనంతరం రూ. 6 లక్షల నగదు ఉన్న బ్యాగ్, రిన్షాద్ యాక్టివాపై నిందితులు పరారయ్యారు. కాచిగూడ వద్ద యాక్టివాను వదిలేసి, బట్టలు మార్చుకుని ఆటోలో చాంద్రాయణగుట్ట షాహీన్ నగర్​లోని మహ్మద్ మత్లాబ్ ఇంటికి వెళ్లి డబ్బులు పంచుకున్నారు.

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఆరు స్పెషల్ టీమ్స్.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా గాలించి చాంద్రాయణగుట్ట షాహీన్ నగర్ లో ఫుర్ఖాన్ అహ్మద్, తయాబ్ త్యాగిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 2.38 లక్షలు, కంట్రీ మేడ్ తుపాకీ, 35 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు అబిద్, ఫహీం ప్రస్తుతం ఉత్తరాఖండ్ జైలులో ఉండగా, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న అబిద్ , ఫహీం అహ్మద్ లో ఓ కేసులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జైలులో ఉన్నారని, పీటీ వారెంట్ వేసి వారిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. మరో ముగ్గురు నౌషాద్, దానిష్ త్యాగి, మహ్మద్ మత్లాబ్ పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు.