సింగరేణిని బలోపేతం చేస్తం .. బీఆర్ఎస్ తీరుతోనే ప్రైవేట్ చేతుల్లోకి కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాక్లు

సింగరేణిని బలోపేతం చేస్తం .. బీఆర్ఎస్ తీరుతోనే ప్రైవేట్ చేతుల్లోకి కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాక్లు
  • ఇల్లెందు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించేందుకు  కృషి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రాద్రికొత్తగూడెం/టేకులపల్లి/ఇల్లెందు/కామేపల్లి, వెలుగు : సింగరేణిని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇల్లందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్ నాయక్ తో కలిసి ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో సబ్​స్టేషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ బీఆర్​ఎస్​సర్కార్​సింగరేణి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిదని, ఒక్కో గని మూత పడ్తున్నా, కొత్త బ్లాకుల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. 

బీఆర్​ఎస్​ అనుసరించిన విధానాల కారణంగానే కోయగూడెం, సత్తుపల్లి కోల్​బ్లాక్ లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయాయన్నారు. ఒడిశాలోని నైనీ కోల్​బ్లాక్ పర్మిషన్ల కోసం తానే స్వయంగా అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడి క్లియరెన్స్​పూర్తి చేయించానని గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు బీమా స్కీంను అమలు చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి ఎస్టీ సబ్​ప్లాన్​కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. 

పోడు భూముల పట్టాలు పొందిన గిరిజన రైతులు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరా సౌర గిరి  జల వికాసం స్కీంను అమలు చేస్తున్నామన్నారు. ఇల్లెందు నియోజకవర్గానికి గోదావరి నీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వానాకాలం సీజన్​అయినప్పటికీ విద్యుత్​వాడకం ఊహించని విధంగా పెరిగిందని, 11 వేల మెగావాట్లు ఉండాల్సిన పీక్​డిమాండ్​ కేవలం వారం రోజుల్లోనే 16,600 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. 

డిమాండ్​ పెరిగినప్పటికీ నిరంతరాయంగా విద్యుత్​అందిస్తున్నామన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగు నీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్​అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఎన్​పీడీసీఎల్​చైర్మన్ అండ్​మేనేజింగ్​డైరెక్టర్ వరుణ్​రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కామేపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు 
శంకుస్థాపన చేశారు.