తాగి కారు నడిపి ట్యాంకర్​ను ఢీకొట్టిన ఐటీ ఎంప్లాయ్... అదుపులోకి తీసుకున్న పోలీసులు 

తాగి కారు నడిపి ట్యాంకర్​ను ఢీకొట్టిన ఐటీ ఎంప్లాయ్... అదుపులోకి తీసుకున్న పోలీసులు 

మూసాపేట, వెలుగు: మద్యం మత్తులో కారు నడిపి వాటర్ ట్యాంకర్​ను ఢీకొట్టిన ఐటీ ఎంప్లాయ్​ను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటలకు కేపీహెచ్​బీ కాలనీ ఫేజ్–6లోని హోలిమేరీ కాలేజీ వద్ద ఓ వాటర్ ట్యాంకర్​ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా.. బీఏసీ లెవెల్ (బ్లడ్ కంటెంట్ ఆల్కహాల్) 226  పాయింట్లుగా నమోదైంది. తాగి కారు నడిపిన వ్యక్తిని నిజాంపేటకు చెందిన సాయికుమార్​గా పోలీసులు గుర్తించారు. అతడు గచ్చిబౌలిలోని టీసీఎస్​లో జాబ్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సాయికుమార్​ను అరెస్ట్ చేశామని, కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జూబ్లీహిల్స్​లో కారు పల్టీ..

ఖైరతాబాద్ :  కారు పల్టీ కొట్టిన ఘటన శనివారం జూబ్లీహిల్స్​లో జరిగింది.  కియా (టీఎస్07జిఎక్స్7989)  కారు డ్రైవర్ ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్  రోడ్ నెం.  45 నుంచి పెద్దమ్మ  గుడి వైపు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో గీతా ఆర్ట్స్ ఆఫీసు సమీపంలో  ఒక బండరాయిపైకి  కారు టైరు ఎక్కడంతో పల్టీ కొట్టింది.  డ్రైవర్ ఒక్కడే ఉండగా అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. 

కారు టైర్ పేలి.. ఐదుగురికి గాయాలు

ఘట్​కేసర్: కారు టైరు పేలి ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన ఘట్​కేసర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఘట్​ కేసర్​కు చెందిన ఫహిద్(19), మెరాజ్(20), జబ్బార్(20), వహీద్(21), నిజాం(19) శనివారం ఔషాపూర్​ సర్వీసు రోడ్డుపై కారులో వెళ్తున్నారు. అంకుషాపూర్ హెచ్​పీఎసీఎల్ సమీపంలో కారు టైర్ పగిలి పక్కనే విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. దీంతో కారులోని ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108లో  ఘట్ కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు ఫైల్ చేశామని పోలీసులు తెలిపారు.