Oscar Dreams: ఆస్కార్ బరిలో 'కాంతార 1', 'మహావతార్ నరసింహ'.. విశ్వవేదికపై రిషబ్ శెట్టి పైచేయి సాధిస్తారా?

Oscar Dreams: ఆస్కార్ బరిలో 'కాంతార 1', 'మహావతార్ నరసింహ'..  విశ్వవేదికపై రిషబ్ శెట్టి పైచేయి సాధిస్తారా?

ప్రపంచ సినిమా వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ (Academy Awards) బరిలో ఈసారి భారతీయ చిత్రాలు మరోసారి సత్తా చాటుతున్నాయి.  ముఖ్యంగా దక్షిణాదిలో అగ్రగామి నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మించిన రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచాయి. ఇది భారతీయ సినీ అభిమానులకు గర్వకారణంగా మారింది.

ఆస్కార్ జనరల్ ఎంట్రీలో 'కాంతార 1', 'నరసింహ'

రిషబ్ శెట్టి సృష్టించిన అద్భుతం 'కాంతార: చాప్టర్ 1' , యానిమేషన్ విజువల్ వండర్ 'మహావతార్ నరసింహ' చిత్రాలు 98వ ఆస్కార్ అవార్డుల జనరల్ ఎంట్రీ (General Entry) విభాగంలో అధికారికంగా చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తూ, "ఆస్కార్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నాం" అంటూ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఆనందాన్ని పంచుకుంది . కేవలం విదేశీ భాషా చిత్రం కేటగిరీలోనే కాకుండా.. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి ప్రధాన విభాగాల్లో కూడా ఈ సినిమాలు పోటీ పడుతున్నాయి.

భారతదేశం నుండి ఐదు చిత్రాల జోరు

ఈ ఏడాది ఆస్కార్ వేదికపై భారత్ తన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన రెండు చిత్రాలతో పాటు మరో మూడు చిత్రాలు కూడా ఈ రేసులో నిలిచాయి. వాటిల్లో 'టూరిస్ట్ ఫ్యామిలీ', అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన 'తన్వీ ది గ్రేట్ ' 'సిస్టర్ మిడ్‌నైట్',  'కాంతార: చాప్టర్ 1' 'మహావతార్ నరసింహ' .  ఈ ఐదు చిత్రాలు విభిన్న జానర్లలో రూపొంది, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. 'కాంతార' వంటి నేటివిటీ ఉన్న కథలు ఆస్కార్ వేదికపై గతంలో 'ఆర్ఆర్ఆర్' (RRR) సృష్టించిన సంచలనాన్ని పునరావృతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

►ALSO READ | Raja Saab Ticket Price Issue: ‘ది రాజా సాబ్’ నిర్మాతలకు హైకోర్ట్‏ షాక్.. టికెట్ రేట్ల పెంపు మెమో సస్పెండ్!

గెలుపు గుర్రాలు తేలేది ఎప్పుడు?

సినిమా ప్రేమికులందరూ ఇప్పుడు జనవరి 22 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2026 జనవరి 22న ఆస్కార్ నామినేషన్ల తుది జాబితాను అకాడమీ ప్రకటించనుంది.   98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026  మార్చి 15, నలాస్ ఏంజెలెస్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకే ఈ అవార్డులలో పోటీపడే అవకాశం కల్పించారు.

హోంబలే ఫిల్మ్స్ ప్రభంజనం

'కేజీఎఫ్' సిరీస్‌తో భారతీయ సినిమా దిశను మార్చిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు 'కాంతార' ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. రిషబ్ శెట్టి నటన, సునీల్ నరసింహ విజువల్ ఎఫెక్ట్స్ గ్లోబల్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీకి వెళ్లడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక అరుదైన రికార్డు. 'కాంతార 1'లో దైవత్వం, ప్రకృతికి మధ్య ఉన్న బంధం ఆస్కార్ జ్యూరీని మెప్పిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరి జనవరి 22న వచ్చే తుది జాబితాలో మన ఇండియన్ సినిమాలు ఏమేరకు చోటు సంపాదిస్తాయో చూడాలి!