విజయవాడకు కృష్ణా బోర్డు

విజయవాడకు కృష్ణా బోర్డు

హైదరాబాద్‌, వెలుగు:  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని విజయవాడకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 8న విజయవాడలో నిర్వహించే జనరల్‌ బాడీ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలో కృష్ణా బోర్డు, తెలంగాణలో గోదావరి బోర్డు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కావడంతో కేఆర్‌ఎంబీని ఇన్నాళ్లు ఇక్కడే కొనసాగించారు. తరలించాలని ఏపీ కోరినా రాష్ట్ర సర్కారు అంగీకరించలేదు. అయితే ఏపీ సీఎం జగన్‌ విజ్ఞప్తి చేయడంతో రెండు నెలల కింద ఓకే చెప్పింది. అయితే కృష్ణా బోర్డు తరలింపునకు నిధుల సమస్య ఉందని, తెలంగాణ సర్కారు చెల్లించాల్సిన రూ.11 కోట్ల బకాయిలు ఇవ్వాలని బోర్డు మెంబర్‌ సెక్రెటరీ కోరారు. అయితే గోదావరి బోర్డు ఖర్చంతా తామే భరిస్తున్నందున కృష్ణా బోర్డు వ్యయాన్ని ఏపీయే చూసుకోవాలని రాష్ట్ర సర్కారు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు తరలింపునకు అవసరమైన రూ.3 కోట్లు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్​ అంగీకరించినట్టు సమాచారం. ఇక కృష్ణా ప్రాజెక్టులపై కొత్తగా తొమ్మిది పాయింట్లలో టెలిమెట్రీ (నీటి తరలింపును కొలిచే పరికరాలు) ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిధుల కొరత పేరిట బోర్డు వాయిదా వేస్తోంది.

గేజ్‌ మార్పుపైనా స్పందించని ఏపీ

నాగార్జునసాగర్‌ కుడి కాల్వ నీటి తరలింపు లెక్కల్లో తప్పులున్నాయని, వెంటనే గేజ్‌ మార్పిడి చేయాలని కృష్ణా బోర్డు ఏపీ జలవనరుల శాఖను కోరింది. కానీ దానిపై ఏపీ సర్కారు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నీళ్ల తరలింపును ఆపాలని ఆదేశించినా పట్టించుకోలేదు. ఇంకా నీటిని తరలిస్తూనే ఉంది. ఇక కృష్ణా బోర్డు ఏర్పాటై ఆరేళ్లు అవుతున్నా వర్కింగ్‌ మ్యానువల్స్‌ సిద్ధం చేయలేదు. బోర్డు చైర్మన్‌, మెంబర్‌ సెక్రెటరీ, మెంబర్లు, ఇరు రాష్ట్రాల ఈఎన్సీల అధికారాలు, బాధ్యతలు, వారి పరిధులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి కృష్ణా బోర్డు జనరల్​ బాడీ మీటింగ్​ ఏపీలోని విజయవాడలోనే జరుగనుంది. అందులో మే నెలాఖరు వరకు ఇరు రాష్ట్రాలు వాడుకునేలా నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు జనరల్‌ బాడీ మీటింగ్‌ అనంతరం త్రీమెన్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు బోర్డు ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.