
చిత్తూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా జలాల రాకతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. 2025, జులై 17న సీఎం చంద్రబాబు నందికొట్కూరు హంద్రీనీవా ఫేస్-1 కార్యక్రమంలో భాగంగా రాయలసీమకు కృష్ణ నీళ్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హంద్రీనీవా జలాలు పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట మండలానికి చేరుకున్నాయి. కృష్ణ జలాలు రాకతో మండల ప్రజలు, రైతులు హంద్రీనీవా కాలువ వద్ద జల హారతులు పట్టి కృష్ణమ్మకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని సాగు, తాగు నీరు లేక ప్రజలు అలమటిస్తున్నామన్నారు. బోర్లు వేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని.. ఇప్పుడు మా ప్రాంతానికి కృష్ణ జలాలు రావడం ఆనందంగా ఉందన్నారు.
ALSO READ : అమ్మా.. ఇదంతా నీ వల్లే..
పట్టణాల బాటపట్టిన రైతులు మళ్లీ గ్రామాలకు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కృష్ణ జలాలు ప్రవహిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి రైతులందరూ ధన్యవాదాలు తెలిపారు. 2025, ఆగస్ట్ 30న కుప్పం నియోజవర్గం, పాలసముద్రం వద్ద సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలకు పూజలు చేయనున్నారు.