డబ్బులు, చీరలు పంచి గెలిచారు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

డబ్బులు, చీరలు పంచి గెలిచారు :  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • ఫలితాలొచ్చి 24 గంటలు గడవకముందే జూబ్లీహిల్స్​లో  కాంగ్రెస్ గూండాయిజం: కేటీఆర్

జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ నాయకులు సంయమనం పాటించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. 

రహమత్‌‌నగర్​లో తమ పార్టీ కార్యకర్త రాకేశ్ ను శనివారం కేటీఆర్, మాగంటి సునీత కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తాము పదేండ్లలో ఎన్నో ఉప ఎన్నికలు గెలిచామని, కానీ ఇలాంటి దాడులకు పాల్పడలేదన్నారు. ఒక్క ఉప ఎన్నికలో గెలిచి ఇలా  మిడిసి పడటం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. 

ఎన్నికలు జరిగి 24 గంటలు కాకముందే ఇలాంటి దాడులకు పాల్పడి గూండాయిజం చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బులు, చీరలు పంచి, రౌడీయిజం చేసి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. 

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు.