సింగరేణిని అమ్మేందుకు కుట్ర: కేటీఆర్

సింగరేణిని అమ్మేందుకు కుట్ర: కేటీఆర్
  • లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నరు
  • కోల్‌‌బెల్ట్ ప్రాంత పార్టీ నాయకులతో భేటీ
  • సంస్థను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి పిలుపు
  • ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన టీబీజీకేఎస్‌‌

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని అమ్మేందుకు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.  సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్‌‌ లో గురువారం కేటీఆర్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సింగరేణిని ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనులను కేంద్రం వేలం వేసింది. కేంద్రంతో సీఎం కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్టు ప్రతి సింగరేణి కార్మికుడికి అర్థమవుతోంది” అని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామని ఆయన అన్నారు. ‘‘కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారు.

కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ.. తట్టెడు బొగ్గును ఎత్తకుండా అడ్డుకున్నాం. కానీ, ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం, గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టాయి. బీఆర్ఎస్​ గొంతుక పార్లమెంట్‌‌లో లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి.. సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటాం’’ అని కేటీఆర్ అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఈ విషయంపై కార్మికులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని, సంస్థను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీబీజీకేఎస్ నాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఢిల్లీలో ధర్నా చేస్తం: రాజిరెడ్డి

బొగ్గు గనులు వేలం వేస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ నాయకుడు రాజిరెడ్డి హెచ్చరించారు. కేటీఆర్‌‌‌‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోల్ ఇండియాలో వేలం లేకుండానే గనులను తీసుకుంటోందని, సింగరేణికి కూడా అలాగే కేటాయించాలన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు దశలవారీగా ఉద్యమం చేస్తామని ఆయన వెల్లడించారు.