- 50 ఎకరాల భూమిని అక్రమంగా గుంజుకునే ప్రయత్నాలు: కేటీఆర్
- దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న
- మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ స్టూడెంట్లతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం సీరియల్ కిల్లర్మాదిరి.. సీరియల్ ల్యాండ్ స్నాచర్‌గా మారిందని మండిపడ్డారు.
అన్ని యూనివర్సిటీల భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ముందు హైకోర్టు కోసమని అగ్రికల్చర్ వర్సిటీ భూములను తీసుకున్న ప్రభుత్వం.. ఆపై హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన నందినగర్‌లోని తన నివాసంలో మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను గుంజుకునే ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. అయితే, విద్యార్థుల ఆందోళన, ప్రజల వ్యతిరేకత, సుప్రీంకోర్టు జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గిందన్నారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పినా.. ఇప్పటికీ కేంద్రం ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు.
భూముల కబ్జాను పట్టించుకోరా?
దేశంలో మైనారిటీల సంరక్షకుడినని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ.. ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం కబ్జా చేస్తున్నా పట్టించుకోకపోవుడేందని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ చెప్తున్న మొహబ్బత్ కీ దుకాణ్ ఇదేనా అని నిలదీశారు. మొహబ్బత్ అంటే విద్యార్థులను రోడ్డున పడేయడమేనా అని అన్నారు.
యూనివర్సిటీల్లో ఉన్న భూములు.. వర్సిటీల భవిష్యత్ విస్తరణ కోసమని చెప్పారు. తెలంగాణ ఉద్యమం వల్లే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పడ్డాయన్నారు. ఉద్యమాలతో ఏర్పడిన యూనవర్సిటీ భూములను రియల్ఎస్టేట్ కోసం వాడుకోవడం దారుణమన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని కేటీఆర్ అన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ఎందుకు పోజులు కొట్టారన్నారు. అశోక్‌నగర్‌లో రాహుల్ గాంధీ విద్యార్థులతో ముచ్చటపెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా అని మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బట్టల దుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వెళ్తే.. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్లు మార్చిమార్చి తిప్పుతున్నారన్నారు.
