- ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నది: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ‘అటెన్షన్ డైవర్షన్’ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతో.. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీశ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులిచ్చిందని విమర్శించారు.
రాజకీయ వేధింపులే పరమావధిగా కాంగ్రెస్ పాలన సాగిస్తోందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, అది రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. ఈ నోటీసుల వెనుక ఉన్న కారణం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని తాము సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామని, ఈ భారీ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే రాత్రికి రాత్రే హరీశ్ రావుకు నోటీసులు పంపారని కేటీఆర్ ఆరోపించారు.
ఇది పక్కాగా రేవంత్ రెడ్డి మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఫైర్అయ్యారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, నోటీసులతో బెదిరించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 24 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందని తెలిపారు.
మెగా పవర్ లూమ్ ఇంకెప్పుడు?
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని పదేండ్లుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల క్లస్టర్ ఏర్పాటు కోసం అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, స్మృతీ ఇరానీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ బతిలాడామని, సీపీసీడీఎస్ నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధ్రువీకరించినా ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి అని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు సోమవారం కేటీఆర్ లేఖ రాశారు.
