పింఛన్లు పెంచుతం ఎంతనేది త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తరు: కేటీఆర్

పింఛన్లు పెంచుతం  ఎంతనేది త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తరు: కేటీఆర్
  • మా పథకాలనే ప్రతిపక్షాలు కాపీ కొడుతున్నయ్
  • కేయూలో పీహెచ్ డీ అక్రమాలపై విచారణ చేయించి, వారంలో చర్యలు తీసుకుంటం
  • స్టూడెంట్లపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ 
  • ఆందోళనల్లో గాయపడిన స్టూడెంట్లకు సారీ చెప్పిన మంత్రి
  • గ్రేటర్ వరంగల్​లో కేటీఆర్ పర్యటన

వరంగల్/హనుమకొండ, వెలుగు: బీఆర్ఎస్ కు ఓటేసి మళ్లీ గెలిపిస్తే, అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పింఛన్ ఎంత పెంచేది త్వరలోనే సీఎం కేసీఆర్‍ ప్రకటిస్తారని చెప్పారు. శుక్రవారం గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలోని వరంగల్‍ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించారు. రూ.900 కోట్ల అభివృద్ధి పనులను, మడికొండలో క్వాడ్రాండ్‍ ఐటీ కంపెనీని ప్రారంభించారు. హనుమకొండలో ఐటీ టవర్స్, మోడల్‍ బస్టాండ్‍ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్‍లో, ఖిలా వరంగల్‍ గ్రౌండ్‍లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్‍ హయాంలో రూ.200 పెన్షన్‍ ఇస్తే, కేసీఆర్‍  దాన్ని రూ.2 వేలకు పెంచారని కేటీఆర్ తెలిపారు.

‘‘ఇప్పుడు పెన్షన్‍ ఇంకెంత పెంచాలె.. ఆడబిడ్డలకు ఎట్ల సాయం చేయాలె .. ఈ పదేండ్లలో చేసిన దానికంటే ఎక్కువగా ఇంకా ఏమీ చేయాలె.. అని కేసీఆర్‍ ఆలోచిస్తున్నరు. తొందర్లోనే అందరూ శుభవార్త వింటారు” అని చెప్పారు. తమ ప్రభుత్వ పథకాలనే ప్రతిపక్ష పార్టీలు కాపీ కొడుతున్నాయని.. రూపాయి, రెండు రూపాయలు ఎక్కువిస్తామని ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ 1956లో బలవంతంగా హైదరాబాద్‍ స్టేట్ ను ఏపీలో కలిపింది. 1971లో 11 లోక్ సభ సీట్లు గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజా సమితి సభ్యులను చేర్చుకుని తెలంగాణ ఏర్పాటుకు అన్యాయం చేసింది. తెలంగాణ ఏర్పాటుపై 2004లోనే మాటిచ్చి 2014 వరకు సాగతీసింది. దానివల్లనే వేలాది మంది యువకులు చనిపోయారు. చివరకు విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్​తెలంగాణ ఇచ్చింది” అని అన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్‍, బీజేపీ అంటే సంక్షోభం.. 

కేసీఆర్‍ అంటే సంక్షేమమని.. కాంగ్రెస్‍, బీజేపీ అంటే సంక్షోభమని కేటీఆర్ విమర్శించారు. ‘‘కాంగ్రెస్‍ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంట్​ఎక్కడున్నదని అడుగుతున్నడు.  కాంగ్రెస్‍, బీజేపీ నాయకులకు మా ఖర్చులతో 100 బస్సులు ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి వరంగల్​లో ఎక్కడికైనా వెళ్లి కరెంట్‍ వైరును బిగబట్టి పట్టుకోవాలి. కరెంట్‍ వస్తదో లేదో తెలుస్తుంది. కరెంట్‍ కనపడ్తలేదంటున్న కాంగ్రెస్ వాళ్లకు సిగ్గుండాలి” అని మండిపడ్డారు. ఇదివరకు 11సార్లు కాంగ్రెస్‍ కు అవకాశం ఇస్తే ఏం చేశారని, మళ్లీ ఒక్క చాన్స్ అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలంతా  రాజీనామా చేస్తే  కిషన్​రెడ్డి మాత్రం పదవిని వదలకుండా అమెరికా వెళ్లాడు. తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణకు ఏమీ చేయని మోదీ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలి” అని ప్రశ్నించారు. బీఆర్‍ఎస్‍ ఎవరికీ బీటీమ్ కాదని, తెలంగాణ ప్రజలకు ఏ టీమ్ అని చెప్పారు. 

పీహెచ్‍డీ అక్రమాలపై ఎంక్వైరీ.. 
 
కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‍డీ అక్రమాలపై వారం రోజుల్లో విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేయూ పీహెచ్ డీ స్టూడెంట్లకు కేటీఆర్‍ హామీ ఇచ్చారు. పీహెచ్‍డీ అక్రమాలపై కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కేయూ స్టూడెంట్ జేఏసీ నేతలు వరంగల్​సీపీ రంగనాథ్ ఆధ్వర్యంలో కేటీఆర్‍ను కలిశారు. పీహెచ్‍డీ కేటగిరీ 2లో జరిగిన అక్రమాలను జేఏసీ నేతలు ఆయనకు వివరించారు. దీనిపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణతో ఎంక్వైరీ కమిటీ వేసి విచారణ చేయిస్తామని, వారం రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు సారీ చెప్పారు.  స్టూడెంట్లపై పెట్టిన పోలీస్ కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. కాగా, కేటీఆర్ హామీ మేరకు వారం పాటు వేచి చూస్తామని.. అయినా న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. 

ముందస్తు అరెస్టులు

కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు, ఆశా వర్కర్లు, మున్నూరు కాపు తదితర సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.   బీఆర్‍ఎస్‍ నాయకులు తన భూమిని కబ్జా చేశారంటూ ఖిలా వరంగల్ కోటలో కనుకుంట్ల తిలక్‍ తేజ అనే యువకుడు పెట్రోల్‍ బాటిల్‍తో సెల్‍ టవర్‍ ఎక్కాడు. పోలీసులు అతన్ని సముదాయించి కిందికి దింపారు.