- ఇది ఓ భూకుంభకోణం.. అడ్డుకోవాలి
- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- కొండగట్టు బాధితులకు రూ. 30 లక్షల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ప్రభుత్వం తీసుకొస్తున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) అతిపెద్ద భూకుంభకోణమని, దాని గురించి కాంగ్రెస్ హై కమాండ్‌కు తెలుసా? లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద భూ కుంభకోణమని, రూ.5 లక్షల కోట్ల స్కామ్ అని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు.
హైదరాబాద్‌లోని బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆర్సీపురం, హయత్‌నగర్ వంటి ఇండస్ట్రియల్ క్లస్టర్లలోని 9,300 ఎకరాల భూములను కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ జోన్లుగా పారిశ్రామికవేత్తలు మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ విలువలో కేవలం 30 శాతం చెల్లిస్తే ఆ భూములకు ఫ్రీహోల్డ్ హక్కులను కల్పించేందుకు తెరలేపిందన్నారు.
లక్షల కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నదని మండిపడ్డారు. కేవలం 45 రోజుల్లోనే వీటికి ఆమోదం తెలపాలనుకోవడం అనుమానాలను కలిగిస్తున్నదన్నారు. ఓఆర్ఆర్ అవతలికి పరిశ్రమలను తరలించే ముసుగులో లక్షల కోట్ల సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సర్కారు ప్లాన్ చేసిందన్నారు.
కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ పాలసీ ఉందన్నారు. దీని గురించి రాహుల్ గాంధీకి తెలియకుంటే.. ఇప్పటికైనా తెలుసుకుని ఈ ల్యాండ్ స్కామ్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
సర్కారు నిర్లక్ష్యం వల్లే.. కొండగట్టులో ప్రమాదం
కొండగట్టు అగ్ని ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. 30 కుటుంబాల భవిష్యత్ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.కోటి దాకా ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని, టైంకు ఫైర్ ఇంజన్లు రాకపోవడంవల్లే ఆస్తి నష్టం భారీగా పెరగడానికి కారణమైందని మండిపడ్డారు.
జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉందని, వచ్చిన ఒక్క ఇంజన్ కూడా పని చేయలేదన్నారు. గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు వచ్చాయన్నారు. దీనికంతటికీ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.30 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు.
