
- దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడ్తున్నరు
- రేవంత్..! చాతనైతే ఎవర్ని లోపలేస్తవో లోపలెయ్
- ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికి డ్రామాలాడుతున్నరని విమర్శ
హైదరాబాద్, వెలుగు : ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘‘పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించిండని నిన్న ఎక్కడ్నో చూసిన. చేస్తే గిస్తే ఒకరిదో, ఇద్దరివో లుచ్చాగాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. నాకేమెరుక గనీ! చేస్తే చేసుండొచ్చు.. దొంగలయ్.. లంగలయ్. ఎందుకంటే, అది పోలీసోళ్ల పని. దానికేదో అంతర్జాతీయ కుంభకోణం, ఏదో జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నరు” అని ఆయన వ్యాఖ్యానించారు. చాతనైతే, దమ్ముంటే ఎవరెవరిని లోపలేస్తరో వేయండి అని సీఎం రేవంత్‌కు సవాల్‌చేశారు.
రేవంత్‌రెడ్డీ..! ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నవ్.. చాతనైతే, దమ్ముంటే ఈ లీకులు బంజేసి చర్యలు తీస్కో. మేము వద్దంటలేం. కానీ, ఈ పనికిమాలిన డ్రామాలు ఆపు” అని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి నడుపస్తలేదని, ఆయనో లీకు వీరుడని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘స్కాములంటూ రోజొక్క లీకులిస్తుండు. డైరెక్ట్‌గా చెప్పరాదురా బై.. సీదా చెప్పు. గిది తప్పయింది, గీన్ని పట్టుకున్నమని చెప్పు. ఫాల్తుమాటలెందుకు? ధైర్యముంటే చెయ్. ముఖ్యమంత్రివి నువ్వు, అధికారం నీది. తప్పులేం జరిగినయో బయటపెట్టు.. ఎవరెవరిని లోపలేస్తవో వెయ్.. మేము వద్దంటలేం” అని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
రైతు బంధు, రుణమాఫీ, మహిళలకు రూ.2,500, పెన్షన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాటి నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి రోజుకొక్క స్కామ్ పేరిట నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
లిక్కర్ కేసులో రూ.60 కోట్లు తీసుకుని వదిలేసిన్రు
లిక్కర్ కేసు నిందితుల్లో ఉన్న ఓ వ్యక్తి వద్ద రూ.60 కోట్లు తీసుకుని, ఆ వ్యక్తిని బీజేపీ వదిలేసిందని కేటీఆర్ ఆరోపించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో చెప్పి, ఆ తర్వాతే ప్రజలను ఈటల రాజేందర్ ఓట్లు అడగాలని ఆయన అన్నారు. ‘‘జైశ్రీరామ్ అనుడు, హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టుడు తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. రామ నాపం జపిస్తూ పరాయోళ్ల సొమ్మును దోచుకుంటున్నరు. ఎలక్టోరల్ బాండ్ల పేరిట రూ.11,565 కోట్లను బీజేపీ దోచుకుంది. లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఒకాయన వద్ద రూ. 60 కోట్లు తీసుకుని ఆయనను బయటకు పంపించిన్రు” అని ఆరోపించారు. అసలు లిక్కర్ కేసు లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంటుంటే, లిక్కర్ కేసు జరిగిందని రేవంత్ అంటున్నారని, ఇద్దరిలో ఎవరిది నిజం అని ప్రశ్నించారు.
కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అయినప్పుడు, కవిత అరెస్ట్ సక్రమం ఎలా అవుతుందో కాంగ్రెస్ వాళ్లు చెప్పాలని ఆయన అన్నారు. ఈటల రాజేందర్, సునీతా మహేందర్‌రెడ్డి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని, వాళ్లిద్దరిని మల్కాజ్‌గిరిలో ఓడించాలని పేర్కొన్నారు. ‘‘కేసీఆర్‌ను విమర్శిస్తున్న సీఎం రేవంత్ మొదలుకుని, యూట్యూబ్‌లో మొరిగే కుక్కల వరకూ అందరికీ ఓటుతోనే సమాధానం చెప్పాలి” అని కామెంట్స్ చేశారు.
బీఆర్‌ఎస్ నుంచి పది మందిని తీస్కోని బీజేపీలోకి పోతడు
లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ బీజేపీలోకి వెళ్తారని, కాంగ్రెస్ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను, బీఆర్‌ఎస్ నుంచి పది మందిని తీసుకొని ఆయన బీజేపీలో చేరుతారని కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడేదానికి, రేవంత్ పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ, అదానీని రాహుల్ తిడుతుంటే, రేవంత్ మాత్రం బడేబాయ్ అంటూన్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి రేవంత్ కష్టపడుతున్నారని ఆయన అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని బిల్డర్లు, ఇతరుల వద్ద డబ్బులు బలవంతంగా వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘‘పేగులు మెడలో వేసుకుంటా అంటున్నవ్. ముఖ్యమంత్రివా? బోటి కొట్టేటోనివా?’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘జేబులో కత్తెర ఎందుకు.. అది అటో, ఇటో అయితే ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త” అంటూ వ్యాఖ్యానించారు.