హామీలు నెరవేర్చాకే ఎన్నికల్లో పోటీ చెయ్..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

హామీలు నెరవేర్చాకే ఎన్నికల్లో పోటీ చెయ్..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
  • ఉచిత కరెంట్‌‌ను ఎగ్గొట్టేందుకే ‘రైతు డిస్కం’ కుట్ర
  • హైదరాబాద్​ను ఏమాత్రం అభివృద్ధి చేయట్లేదు
  • కంటోన్మెంట్ కార్యకర్తల మీటింగ్​లో విమర్శలు

పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టకుంటే, ఇందిరమ్మ ఇండ్లు కట్టకుంటే ఎన్నికల్లో పోటీ చేయనంటూ రేవంత్ రెడ్డి కొత్త అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

రైతులకు అందుతున్న 24 గంటల ఉచిత విద్యుత్‌‌ను రద్దు చేసేందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ను తీసుకువస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని అన్నారని, ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ మాటను ఆచరణలో పెట్టడానికే ఈ కుట్రకు తెరలేపారని విమర్శించారు. రైతు డిస్కం అంటే రైతన్న మెడకు ఉరితాడు బిగించడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాలలో హైదరాబాద్ నగరాన్ని పైసా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి ఇక్కడ 6 వేల ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పైగా ‘హైడ్రా’ అనే భూతాన్ని తెచ్చి పేదల ఇళ్లను కూలగొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీలను నెరవేర్చడనే విషయం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.