కేటీఆర్ సీఎం అంటే బీఆర్ఎస్​కు 3 సీట్లు కూడా రాకపోవు : బండ్ల గణేశ్

కేటీఆర్ సీఎం అంటే  బీఆర్ఎస్​కు 3 సీట్లు కూడా రాకపోవు : బండ్ల గణేశ్
  •  కవిత, హరీశ్​ కు ఉన్న అవగాహన కూడా ఆయనకు లేదు 

హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్న బాధ, ఫ్రస్ట్రేషన్ తో కనీస అవగాహన లేకుండా కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ కు మూడు సీట్లు కూడా వచ్చేవి కావని విమర్శించారు. మంగళవారం గాంధీ భవన్ లో గణేశ్​మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కవిత, హరీశ్ రావుకు ఉన్న అవగాహన కూడా కేటీఆర్ కు లేదన్నారు. నా జీవితంలో చూసిన అత్యంత డర్టీ పొలిటీషీయన్ ఆయనే అని మండిపడ్డారు. 

లోక్​సభ ఎన్నికల్లో పోటీపై పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తానని చెప్పారు. మరో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అని ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమెకు వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని, ఇక జబర్దస్త్ లో యాక్ట్ చేసుకోవడమే అని అన్నారు. ఆమె ఓ డైమండ్ రాణి, పులుసు రాణి అని ఎద్దేవా చేశారు.