కాంగ్రెస్, బీజేపీ ఎట్ల కలుస్తయి?

కాంగ్రెస్, బీజేపీ  ఎట్ల కలుస్తయి?

పేరుకే ఢిల్లీ పార్టీలు.. చేసేవి సిల్లీ పనులు

రెండు కుమ్మక్కైనయి.. ఒకరి కండువా మరొకరు కప్పుకుని తిరగాలె

మేడ్చల్, నేరేడుచర్లలోనూ మేమే గెలుస్తం

హామీలన్నీ అమలు చేస్తం.. పనిచేయకపోతే పదవి పోతది

నిజామాబాద్లో ఎంఐఎం సహకారానికి థాంక్స్

త్వరలో కౌన్సిలర్లు,కార్పొరేటర్లకు ట్రైనింగ్

‘‘కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిగ్గులేదు.. వాళ్లు ఎట్ల కలుస్తరు. మక్తల్​లో బీజేపీకి కాంగ్రెస్​ సపోర్టు చేస్తె.. మణికొండలో కాంగ్రెస్​కు బీజేపీ మద్దతు ఇచ్చింది. పేరుకే ఢిల్లీ పార్టీలు, చేసేవన్నీ సిల్లీ పనులే..” అని టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ విమర్శించారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలోనే తాము చెప్పామని, అది ఇప్పుడు నిజమైందని, మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆ పార్టీలు కలిసి పోయాయని పేర్కొన్నారు. సోమవారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, మేయర్ల ఎన్నిక పూర్తయ్యాక తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీజేపీల బాగోతం బయటపడింది. అవి ఒకే తాను ముక్కలు, వారిది ఫెవీక్విక్  బంధం.. ఉత్తమ్  బీజేపీ కండువా కప్పుకోవాలి, బీజేపోళ్లు ఉత్తమ్ కండువా కప్పుకుని తిరిగితే అయిపోతుంది.

వారిది అపవిత్ర అవగాహన, నిస్సిగ్గుగా విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఢిల్లీలో ఎప్పుడూ కొట్టుకునే ఆ పార్టీలు మున్సిపాలిటీల కోసం కలిసిపోయాయి. బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఇవేనేమో” అని కామెంట్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి పార్టీలు తిప్పలు పడ్డాయన్నారు. 110 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలో గెలిచామని.. కరీంనగర్ కార్పొరేషన్ ను, మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపాలిటీలనూ కైవసం చేసుకుంటామని చెప్పారు.

ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తం

మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కేటీఆర్  చెప్పారు. పట్టణాల్లో కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తామన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు త్వరలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. మున్సిపాల్టీలకు ప్రతి నెలా రూ.173 కోట్లు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ కు ఎన్నడూ లేనివిధంగా విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు.

తప్పు చేస్తే సర్వీస్ నుంచి రిమూవ్

అందరూ డ్యూటీ సరిగ్గా నిర్వర్తించాలని, పనిచేయని వారిని తప్పిస్తామని, ఎన్నికైన అందరూ మన వాళ్లే అయినా చూడబోమని కేటీఆర్​ స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ ఉద్యోగులూ అవినీతికి తావులేకుండా డ్యూటీ చేయాలని, తప్పు చేస్తే సహించబోమని హెచ్చరించారు. చట్టం ప్రకారం అనుమతులు ఇవ్వాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే సర్వీస్ నుంచి తొలగిస్తామని, సదరు నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండానే కూల్చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తెచ్చామని, త్వరలోనే అమలు చేసి ఉద్యోగుల బదిలీలు చేపడతామని తెలిపారు.

వార్డుకు నాలుగు కమిటీలు

పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేస్తామని.. అందులో యూత్, విమెన్, సీనియర్ సిటిజన్, రెసిడెంట్ వెల్ఫేర్  కమిటీలు ఉంటాయని కేటీఆర్​ చెప్పారు. ‘‘పాలనలో పౌరులను భాగస్వామ్యం చేయాలి. అప్పుడే జవాబుదారీతనం ఉంటుంది. ఇంటి నిర్మాణం, ఇంటి పన్నుపై సెల్ఫ్​ డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే పెద్ద మొత్తంలో ఫైన్ ఉంటుంది. ప్రతి ఇంటికి కొత్తగా డిజిటల్ డోర్ నంబర్ ఇస్తం. ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్ లో గ్రీనరీ కోసం 10 శాతం బడ్జెట్ కేటాయించాలి..” అని సూచించారు.

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైనయి. మున్సిపల్​ చైర్మన్​ పదవుల కోసం కలిసిపొయినయ్. ఈ విషయం మేం ఎలక్షన్​ప్రచారంలోనే చెప్పినం. ఇప్పుడా బాగోతం బయటపడింది. ఢిల్లీలో ఎప్పుడూ కొట్టుకునే ఆ పార్టీలు ఇక్కడ కలిసిపొయినయ్. బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఇవ్వేనేమో..!