ప్రజాస్వామ్యం ఖూనీ.. సుప్రీంకోర్టు, రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు: కేటీఆర్ 

ప్రజాస్వామ్యం ఖూనీ.. సుప్రీంకోర్టు, రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు: కేటీఆర్ 
  • స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ: హరీశ్ రావు
  • ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్​ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాకుండా.. రాజ్యాంగంపైనా రాహుల్​ గాంధీ, కాంగ్రెస్  పార్టీకి ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్  తీర్పు నేపథ్యంలో బుధవారం కేటీఆర్​స్పందించారు. ఫొటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని మండిపడ్డారు. తన తండ్రి రాజీవ్  గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. 

అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీ వారిని కాపాడారన్నారు. రేవంత్​ రెండేండ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని, ఆ భయంతోనే కాంగ్రెస్​ పార్టీ ఉప ఎన్నికలు అంటే జంకుతున్నదని విమర్శించారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నదని ఆరోపించారు. 

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి.. తాజాగా స్పీకర్​ నిర్ణయం వరకు కాంగ్రెస్​ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా.. కేవలం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని.. అందులోని నిబంధనలను స్పీకర్ పట్టించుకోకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారన్నారు.

కాంగ్రెస్​ పతనం షురూ: కేటీఆర్​

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ పార్టీ మరింత పతనమవడం ఖాయమని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ పాపం పండింది కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు. రెండేండ్లుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. 

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను తట్టుకొని వీరోచితంగా పోరాడి బీఆర్​ఎస్​కు అండగా నిలిచారన్నారు.  ‘‘యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్​ఎస్​ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది” అని కేటీఆర్ పేర్కొన్నారు.