హైదరాబాద్, వెలుగు: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, అరాచకాలకు ఎదురొడ్డి గెలిచారని బీఆర్ఎస్ సర్పంచ్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. శనివారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో పలు జిల్లాల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులతో ఆయన సమావేశమయ్యారు.
అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు నిలబడ్డారన్నారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా గెలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. స్వయంగా సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం.. పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నదన్నారు.
శాలువాపై క్యూఆర్ కోడ్.. ఆవిష్కరించిన కేటీఆర్
సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్.. శాలువాపై క్యూఆర్ కోడ్‌ను నేశారు. ఈ క్యూఆర్ కోడ్ శాలువాను శనివారం కేటీఆర్ ఆవిష్కరించారు. ‘పోగుబంధంతో ఫోన్బంధం’ అనే కాన్సెప్ట్‌తో ఈ శాలువాను నేసినట్టు విజయ్ కుమార్ తెలిపారు.
