ముఖ్యమంత్రివా..ముఠా నాయకుడివా? : కేటీఆర్

ముఖ్యమంత్రివా..ముఠా నాయకుడివా? : కేటీఆర్
  •     సీఎం, హోంమంత్రిగా ఉండి కూడా నేరాలు రెచ్చగొట్టేలా మాట్లాడ్తవా?: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేంవంత్ రెడ్డి రెండేండ్లలోనే అట్టర్​ఫ్లాప్ అయ్యాడని, తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్​కు పూర్తిగా మతిభ్రమించిందని ఖమ్మం సభ సాక్షిగా తేలిపోయిందన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే కేసులు పెట్టి, అరెస్టులు చేసే పోలీసుశాఖ, డీజీపీ.. సీఎం చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆదివారం ‘ఎక్స్’​లో చేసిన పోస్ట్​లో కేటీఆర్​ప్రశ్నించారు.

‘‘సీఎంగానే కాకుండా.. హోంమంత్రిగా ఉన్నావనే సోయి కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను మరిచి, అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నవ్ నువ్వు సీఎంవా? ముఠా నాయకుడివా’’ అని పేర్కొన్నారు. 

ఒక కాంగ్రెస్​ సీఎంగా ఉండి.. టీడీపీ పాట పాడడం వెనకున్న అసలు కుట్ర తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు. రెండేళ్లుగా పాత బాస్​ ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టంచేసేలా జలహక్కులను కాలరాశారని తేలిపోయిందన్నారు. నీళ్ల నుంచి మొదలుకుని నిధులు, నియామకాల వరకూ తెలంగాణను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.