బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్వి డ్రామాలు..హైకోర్టు ఇచ్చిన స్టేతో తేటతెల్లమైంది: కేటీఆర్

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్వి డ్రామాలు..హైకోర్టు ఇచ్చిన స్టేతో తేటతెల్లమైంది: కేటీఆర్

హైదరాబాద్​, వెలుగు:  స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులూ మోసపూరితంగా వ్యవహరించిందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. ‘‘42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్​ ఆడింది డ్రామాలేనని హైకోర్టు ఇచ్చిన స్టేతో తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయింది” అని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  కామారెడ్డి డిక్లరేషన్​ను  సీఎం రేవంత్​రెడ్డి కాలరాశారని, బీసీలను దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కులగణన మొదలు జీవో దాకా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అడుగడుగున చేసిందంతా మోసమని, నయవంచన అని విమర్శించారు. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సింది పోయి, ఏకపక్షంగా దేశ రాజధానికి వెళ్లి ధర్నా పేరిట నాటకమాడారని ఆయన దుయ్యబట్టారు.  ఓవైపు రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్​లో ఉండగానే ఆర్డినెన్స్​ పేరిట కొంతకాలం ప్రభుత్వం హంగామా చేసిందని.. కోర్టుల్లో నిలబడని జీవోతో మభ్యపెట్టిందని విమర్శించారు. 

‘‘22 నెలల కాంగ్రెస్​ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ వ్యతిరేకతను చూసి సీఎం భయంతో వణికిపోతున్నారు. అందుకే స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి వాయిదా వేయించేందుకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పావుగా వాడుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన దగాకు తోడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీ బిల్లులను పెండింగ్ లో పెట్టి దారుణంగా వెన్నుపోటు పోడిచింది” అని కేటీఆర్​ ఆరోపించారు.

జీసీసీలకు హైదరాబాద్​ రాజధాని 

గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్​ రాజ ధానిగా మారిందని కేటీఆర్​ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్​.. త్వర లోనే మొదటి ప్లేస్​కు వస్తుందని ఆయన గురువారం  
నోవాటెల్‌లో జరిగిన జీసీసీ సమావేశం లో పేర్కొన్నారు. జీసీసీలకు హైదరాబాద్​ రాజధానిగా మారడం వెనుక గత ప్రభుత్వ కృషి ఎంతో ఉందని చెప్పారు.