ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్ చేస్తరా? : కేటీఆర్

ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్ చేస్తరా? : కేటీఆర్
  •     కేటీఆర్ మండిపాటు

హైదరాబాద్, వెలుగు: ముందస్తు నోటీసులు లేకుండా దళిత నాయకుడిని అరెస్ట్​ చేయడం రేవంత్​ ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని బీఆర్‌‌ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌‌ మండిపడ్డారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్​ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్​ నాయకులకు తలొగ్గి పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. 

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందని, క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్​ఎస్​కు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఆ తీర్పును అపహాస్యం చేస్తూ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. 

ఎన్నికల అక్రమాలను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే సుమన్​పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. అధికారపార్టీ అక్రమాలకు వంతపాడుతున్న ప్రతి పోలీస్‌ అధికారి.. భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం, గవర్నర్ జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.