బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి : కేటీఆర్‌‌‌‌

బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి : కేటీఆర్‌‌‌‌
  • ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదు: కేటీఆర్‌‌‌‌
  • తప్పు చేసిన కొడుకును ఆయనే దాచిపెట్టిండు
  • దేశ చరిత్రలో బహుశా మొదటిసారి 
  • ఓ కేంద్రమంత్రి కుమారుడిపై లుకౌట్‌‌ సర్క్యులర్‌‌ జారీ
  • ఇలాంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో కొనసాగడం..
  • తెలంగాణకే కాదు, దేశానికే అవమానం
  • ‘సర్‌‌‌‌’పై అనుమానాలున్నాయని కామెంట్​

ఎల్బీనగర్‌‌‌‌, వెలుగు: ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌‌, బీజేపీలు కలిసి బాధితురాలికి అన్యాయం చేయాలని చూశాయని, కానీ ఆ బాలికకు న్యాయం జరిగేలా బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ మాత్రమే పోరాడిందని అన్నారు.

ఆదివారం ఎల్బీనగర్​లోని ఓ కన్వెన్షన్ హాల్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నా బూత్‌‌- –నా భవిష్యత్‌‌’ కార్యక్రమంలో కేటీఆర్‌‌‌‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..  రెండున్నరేండ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. ప్రధాని మోదీ చెబుతున్న ‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. దేశ చరిత్రలో బహుశా మొదటిసారి ఓ కేంద్రమంత్రి కుమారుడిపై లుకౌట్‌‌ సర్క్యులర్‌‌ ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు.

బండి సంజయ్‌‌ని మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ఈ కేసులో విచారణ సరిగా జరగదని కేటీఆర్ అన్నారు. తప్పు చేసిన కొడుకును దాదాపు 9 రోజులపాటు దాచిపెట్టింది కేంద్రమంత్రేనని ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసి కేసును నీరు గార్చాలని చూశారన్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో కొనసాగడం తెలంగాణ రాష్ట్రానికేగాక దేశానికే అవమానమని మండిపడ్డారు.

 ‘సర్’పై అనుమానాలున్నాయి

వచ్చే నెలలో తెలంగాణలో నిర్వహించనున్న  ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై అనుమానాలున్నాయని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌‌‌‌ సూచించారు. ఓట్ల తొలగింపు, ఓటర్ల చేర్పులు, రెండు చోట్ల ఉన్న ఓట్ల తొలగింపుపై పూర్తి సమాచారం బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర ఉండాలని, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు సేకరించాలని దిశానిర్దేశం చేశారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఇప్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ సర్వేలో ప్రతి రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు అవకాశం ఇచ్చారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీ బలోపేతం కోసం ఓటరు జాబితా పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

కూల్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన

సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకుందని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా ధ్వంసమైందని కేటీఆర్‌‌‌‌ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌‌ను విశ్వనగరంగా నిర్మిస్తే.. రేవంత్‌‌రెడ్డి పాలనలో నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అబద్ధపు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు, గ్యారంటీలను గాలికి వదిలేశారని విమర్శించారు. మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అని, పేదల కష్టాలు తీరుతాయని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు.