ఓటుకు రూ. 5 వేలకన్నా తక్కువ తీసుకోవద్దు..వంద తగ్గినా నిలదీయండి: కేటీఆర్

ఓటుకు రూ. 5 వేలకన్నా తక్కువ తీసుకోవద్దు..వంద తగ్గినా నిలదీయండి: కేటీఆర్

 

  • కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకుని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేయండి
  • జూబ్లీహిల్స్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌కు బుద్ధిచెప్తేనే రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు 
  • ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ మోసపోక తప్పదని కామెంట్​

హైదరాబాద్/జూబ్లీహిల్స్​, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్​లో కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తుందని, ఓటుకు రూ.5 వేలు ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఓటుకు రూ.5 వేల కన్నా తక్కువ తీసుకోకండి. వంద తగ్గినా నిలదీయండి. అందులోనూ కమీషన్లు బొక్కుతున్నారా? అని అడగండి. కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకొని.. బీఆర్ఎస్‌‌కు ఓటు వేయండి” అని ప్రజలకు సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో పలువురు బీఆర్ఎస్‌‌లో చేరిన సందర్భంగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌‌పేట్‌‌లో  నిర్వహించిన రోడ్‌‌ షోలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్​ వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని, రెండేండ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ​భ్రష్టుపట్టించిందని దుయ్యబట్టారు.

 ‘‘కాంగ్రెస్ నేతలు ప్రజలను భయపెడుతూ బెదిరింపులకు దిగుతున్నారు. ‘పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందన్నట్టు’ వాళ్లకన్నా మనకు తెలివి ఎక్కువే ఉంది. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా ఉండండి. ఎవరైనా బెదిరిస్తే వారి సంగతి తర్వాత చూద్దాం” అని వ్యాఖ్యానించారు. అడ్డమైన హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. ‘‘తులం బంగారం ఇస్తాం.. యువతులకు రూ.2,500 ఇస్తాం.. ఇలా కాంగ్రెస్​ ఎన్నో హామీలు ఇచ్చింది. పేదలకు బంగారం కాదు.. కనీసం బియ్యం కూడా ఇవ్వట్లేదు. కాంగ్రెస్‌‌ నేతలు వచ్చి ఓట్ల కోసం డబ్బులు ఇస్తే తీసుకోండి. అవి తీసుకొని మిగతా డబ్బులు ఎక్కడని నిలదీయండి. ఇచ్చిన హామీల మేరకు ఎంత బాకీ ఉన్నారో వాళ్లకు చెప్పండి. ఆ హామీలపై వారిని నిలదీయాల్సిన టైమ్‌‌ వచ్చింది” అని అన్నారు. 

గెలుపు మాదే.. మెజార్టీ తేలాలి..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 4 లక్షల మంది ఓటర్లు  కాంగ్రెస్‌‌కు బుద్ధి చెబితే.. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని  కేటీఆర్ అన్నారు.  జూబ్లీహిల్స్‌‌లో గెలుపు మళ్లీ తమదేనని, మెజార్టీ ఎంతో తేలాలని పేర్కొన్నారు.   ఈ సెగ్మెంట్‌‌లో మాగంటి గోపీనాథ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. 2023  ఎన్నికల్లో నగరంలో ఒక సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలువ లేకపోయిందన్నారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తిరిగి కేసీఆర్ రావాలని,ఈ ఉప ఎన్నికతోనే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి మోసపోక తప్పదని  ప్రజలను హెచ్చరించారు. ‘పదేండ్ల బీఆర్ఎస్ పాలన చూశారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలన కూడా చూశారు. ఈ రెండింట్లో ఏ ప్రభుత్వం బాగా పనిచేసిందో యాదికి తెచ్చుకొని ఓట్లు వేయండి” అని కోరారు.