
హైదరాబాద్: ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ పార్టీ మారేది లేదని తనతో చెప్పారని, అయితే అప్పుడు వాళ్ల మాటలు పిచ్చివాడిలా నమ్మానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, 15రోజుల్లో జెండా మార్చారన్నారు. రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఆస్కార్ లెవల్లో నటించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్మాట్లాడుతూ ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు.
కవిత అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి పోయిన రంజిత్ రెడ్డి.. పట్నం మహేందర్ రెడ్డిలపైన పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్లు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ బీఆర్ఎస్లోకి రానీయ్యం. కేకే, కడియంలాంటి నాయకులు పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్తున్నరు. కొందరు కొన్ని రాళ్లు వేసి పోతరు. వారి విమర్శలపైన వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్న. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా..పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్త. వచ్చే 13న జరిగే చెవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరూ తరలిరావాలి’ అని పిలుపునిచ్చారు.
రేవంత్.. ఐదేండ్లు ప్రభుత్వంలో ఉండు
‘సీఎం రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు. రైతులకు రుణమాఫీ, 4వేల పింఛన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హామీలు తుంగలో తొక్కిన్రు. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి. రేవంత్ ఐదేండ్లు ప్రభుత్వంలో ఉండు. కాంగ్రెస్420 హామీలు నెరవేర్చు. నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులైతరు’ అని అనారు.