కేటీఆర్ అబద్ధాల కోరు : జి.నిరంజన్

కేటీఆర్ అబద్ధాల కోరు : జి.నిరంజన్

హైదరాబాద్, వెలుగు:  కేటీఆర్​ అబద్ధాల కోరు అని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కవ్వడం వల్లే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు వచ్చాయని కేటీఆర్ అనడం పూర్తిగా అబద్ధమన్నారు. శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వనరులు, అధికారుల కేటాయింపు కోసమే కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని పేర్కొన్నారు.

 గతంలోనూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇచ్చారని, కోర్టులు కూడా ఆ విధానాన్ని సమర్థించాయని గుర్తు చేశారు. 2018లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా నాటి సీఎం కేసీఆర్​ మీడియాకు చెప్పారని, ఎన్నికల కమిషనర్​తో మాట్లాడాకే ఆ విషయం చెప్తున్నానంటూ కేసీఆర్​ అన్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు సంబంధించిన అంతర్గత విషయాలు కేసీఆర్ లాంటి వారికే తెలుస్తాయన్నారు. కారు సర్వీసుకు మాత్రమే వెళ్లిందని కేటీఆర్​ అంటున్నారని, అసలు కారు అనేది స్క్రాప్​గా మారిందని ఎద్దేవా చేశారు.