కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హత లేదు

 కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హత  లేదు

హైద‌రాబాద్- తెలంగాణ రాష్ట్ర సీఎం అయ్యే అర్హత మంత్రి కేటీఆర్‌ కు లేదని తెలిపారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. పోమ‌వారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొండా… పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం అయ్యే అర్హత ఈటల రాజేందర్, హరీష్‌ రావులకు మాత్రమే ఉందన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కొంత వరకు ఆ అర్హత ఉందన్నారు. వ్యక్తిగతంగా కేటీఆర్ చాలా మంచి వ్యక్తేనని, అయితే ముఖ్యమంత్రికి ఆయన సూటబూల్ కాదన్నారు. తనకు టీఆర్ఎస్ నాయకులతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలిపిన విశ్వేశ్వ‌ర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో తనకు శత్రువులు లేరని, అందరూ మిత్రులే అన్నారు.  అయితే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడిందన్నారు. టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేదని, అందుకే బయటకు వచ్చానని చెప్పారు. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాకూర్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డికి వివరించానని చెప్పారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చినా తాను మళ్లీ కాంగ్రెస్‌ లోకి రానని  తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందన్న ఆయ‌న‌.. ఇంతో అంతో ఉందంటే తెలంగాణలోనే బ‌లంగా ఉందన్నారు. పంజాబ్, హరియాణ, అస్సోంలో కాస్త కాంగ్రెస్ ప్రభావం ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడిందన్నారు. తెలంగాణలో రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇచ్చినా.. ఆయన పార్టీని పైకి తీసుకురాలేరని అభిప్రాయపడ్డారు. తాము తెలంగాణ కోసం పోరాటం చేస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడతామన్నారు. సీఎం కేసీఆర్ మంచి దారిలో నడిస్తే ఆయనకే తాను మద్దతు ఇస్తానన్నారు. ముఖ్యమంత్రి మంచివాళ్లను దూరం చేసుకుంటున్నారని, ద్రోహులను దగ్గర చేర్చుకుంటున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.