ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది

ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది
  • రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో పెట్టుబడులు పెరుగుతున్నాయి
  • స్పేస్ టెక్నాలజీ రంగంలో ముందు వరుసలో తెలంగాణ 
  • రాష్ట్ర ఐటీ, వాణిజ్య 2021,22 వార్షిక రిపోర్ట్ లాంచ్ చేసిన కేటీఆర్ 

గత ఎనిమిదేళ్లలో ఐటీలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021,22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ సాధించిన పురోగతి వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, TSIIC MD వెంకట్రామిరెడ్డి, యూఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రెఫ్మాన్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మ‌న్‌ జగన్మోహన్ రావు, వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టాస్క్ రిసోర్స్ బుక్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 

2021,22లో ఐటీ ఎగుమతుల విలువ రూ. 1,83,569 కోట్లనీ చెప్పారు. ఇది గతేడాది కంటే 26.14% ఎక్కువన్నారు. ఒక్క ఏడాదిలోనే 1,50,000 కొత్త ఉద్యోగాలు కల్పించామన్నారు. నేషనల్ ఎక్స్ పోర్ట్స్ 17.2 % ఉంటే... తెలంగాణ 26.14% ఉందని, ఇది 9% ఎక్కువని చెప్పారు. 2035 కల్లా ITIR సపోర్ట్ లేకుండానే 13 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. భారత GDP గ్రోత్ పడిపోతుంటే తెలంగాణ గ్రోత్ మాత్రం పెరుగుతోందన్నారు. ఈ నెల 20న టీ హబ్ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీని ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 

రాష్ట్రంలో ఐటీ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రామగుండంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో స్మార్ట్ టీవీలు తయారవుతున్నాయని వివరించారు. 500 మంది ఉద్యోగులతో ఏడాదికి 1.8 మిలియన్ టీవీలని తయారు చేస్తున్నారని అన్నారు. కండ్లకోయలో ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, అందులో 200 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ సిస్కా హైటెక్ సిటీలో తమ సంస్థను ప్రారంభించనుందన్నారు. స్పేస్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. హెల్త్, అగ్రికల్చర్ రంగాల్లో టెక్నాలజీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. 

ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ : 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పాలసీలతో తెలంగాణలో పెట్టుబడులు పెరుగుతున్నాయని ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. భారత్ లో ఇతర మెట్రో సిటీస్ తో పోలిస్తే... హైదరాబాద్ మంచి ప్లేస్ లో ఉందన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఐటీ ఎక్స్ పోర్ట్స్ ఏటేటా పెరుగుతున్నాయని, ఇది రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎమ్ఎస్ఎమ్ఈలకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని చెప్పారు. 

స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మ‌న్‌ జగన్మోహన్ రావు : 
తెలంగాణ ఏర్పడ్డప్పుడు చాలామంది హేళన చేశారని, రాష్ట్ర ఆగమై..కొత్త కంపెనీలు రావని, అలాంటి వారికి ఇప్పుడున్న రాష్ట్రమే ఒక సమాధానమని స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మ‌న్‌ జగన్మోహన్ రావు అన్నారు. టీ హబ్, వీ హబ్ తో టాలెంట్ ఉన్నవారికి స్టార్టప్ లు ఏర్పాటు చేసుకునేందుకు చేయూత అందిస్తున్నామని వివరించారు. 

యూఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రెఫ్మాన్ :
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని యూఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రెఫ్మాన్ అన్నారు. అమెరికా నుంచి చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఎక్కువగా ఏవియేషన్, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు అమెరికా తర్వాత తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో స్థాపించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తోందన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం..

సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కన్నుమూత

పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!