పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!

పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!
  • రాజ్యసభలో ప్రస్తుతం ముగ్గురు బీజేపీ ఎంపీలు (ముస్లిం)
  • జూన్​ 10న రాజ్యసభ ఎన్నికలు 
  • ముఖ్తార్ అబ్బాస్​ నఖ్వి, సయ్యద్ జాఫర్ ఇస్లాం, ఎంజే అక్బర్ పదవీకాలం జులై 7తో ముగింపు
  • ప్రస్తుతం ఎన్​డీఏ కూటమిలో ఒక్క ముస్లిం ఎంపీ మాత్రమే
  • లోక్ సభలో లోక్​ జన్​శక్తి పార్టీకి చెందిన మెహ్​బూబ్​ అలి ఖైజర్ ప్రాతినిథ్యం

రాజ్యసభ స్థానాలకు జూన్​ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభలో ప్రస్తుతం ముగ్గురు బీజేపీ ఎంపీలు ( ముఖ్తార్ అబ్బాస్​ నఖ్వి, సయ్యద్ జాఫర్ ఇస్లాం, ఎంజే అక్బర్​) ఉన్నారు. ఈ ముగ్గురి పదవీకాలం త్వరలో ముగియనుంది. లోక్ సభలో ప్రస్తుతం బీజేపీకి ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా లేరు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల తర్వాత పెద్దల సభలోనూ బీజేపీ తరపున ముస్లిం ఎంపీ ఒక్కరూ కూడా ఉండకపోవచ్చు. రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన లిస్ట్ ను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన 22 మంది జాబితాలో ఈ ముగ్గురితో పాటు పార్టీలో సీనియర్లుగా గుర్తింపు పొందిన ముస్లిం నేతల పేర్లు లేవు. 

ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వి.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. జులై 7తో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఆరు నెలల్లోపు నఖ్వి తిరిగి పార్లమెంట్​లో సీటు సంపాదించుకోకపోతే కేబినెట్​లో పదవి పోతుంది. ఉత్తర్​ప్రదేశ్​ రామ్​పూర్​ నియోజకవర్గం నుంచి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్విని ఎన్నికల బరిలో దింపే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ (ఎస్​పీ) నేత అజామ్​ ఖాన్ తన రామ్​పూర్​ లోక్​సభ సీటుకు రాజీనామా చేశారు. రామ్​పూర్​ లోక్​సభ నియోజకవర్గానికి జూన్​ 23న ఉపఎన్నిక జరగనుంది. ఒకవేళ ఈ ఎన్నికలో గెలిస్తే లోక్​సభలో బీజేపీ తరఫున ఉన్న ఏకైక ముస్లిం నేత నఖ్వీ అవుతారు.

మరోవైపు 12మందిని రాజ్యసభకు నామినేట్​ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ప్రస్తుతం 7 నామినేటెడ్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ప్రముఖ ముస్లిం నేతను ఆ పదవికి బీజేపీ ఎంపిక చేయవచ్చని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే బీజేపీ తరఫున ముస్లిం ఎంపీ రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం ఉంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఆరుగురు ముస్లిం నేతలను బరిలోకి దింపింది. వారందరూ ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమిలో ఒక్క ముస్లిం ఎంపీ మాత్రమే ఉన్నారు. లోక్​ జన్​శక్తి పార్టీకి చెందిన మెహ్​బూబ్​ అలి ఖైజర్​. ఈయన ఖగారియా లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

మరిన్ని వార్తల కోసం..

గాంధీ ఫ్యామిలీపై స్మృతీ ఇరానీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లెస్బియన్ జంట కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు