లేక్ వ్యూ డబుల్ బెడ్రూంలను ప్రారంభించిన కేటీఆర్

లేక్ వ్యూ డబుల్ బెడ్రూంలను ప్రారంభించిన కేటీఆర్

సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అంబేద్కనగర్‌లో రూ. 28 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 330 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత మోతే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొత్త ఇండ్లతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. ‘అంబేద్కనగర్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఇంతకుముందే ఒక అక్క నాతో చెప్పింది. ఎలా ఉన్న అంబేద్కనగర్‌ ఎలా మారింది అని. ఆమె ఇక్కడ 40 ఏళ్లుగా ఉంటుందట. జీవితంలో అంబేద్కర్ నగర్ ఇలా మారుతుందని  తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. వర్షం పడితే బిక్కుబిక్కుమంటూ బతికేవాళ్లమని చెప్పింది. అలాంటిది ఇంత మంచి ఇళ్లు వస్తాయని అనుకోలేదని చెప్పింది. ఆ మాటలు విన్న నాకు చాలా సంతోషం అనిపించింది. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. ఆ రెండింటిని పేదలకు నేనే చేస్తానని సీఎం కేసీఆర్ అంటున్నారు. హైదరాబాద్‌లో రూ. 9 వేల కోట్ల ఖర్చుతో పేదల కోసం ఇండ్లు కడుతున్నాం. ఇళ్ల కోసం మీరు గొడవపడొద్దని మీ ముందే చీటీలు తీసి ఇళ్లు కేటాయిస్తున్నాం. ఇంతమంచి పని చేసిన ప్రభుత్వం మీ నుంచి ఆశించేది ఏమిటో తెలుసా? మీరు రెండే రెండు పనులు చేయాలి. అవేంటంటే.. సీఎం కేసీఆర్‌కు చెట్లంటే ప్రాణం. అందుకే మీరు కూడా చెట్లను పెంచాలి. రెండోది.. మీ ఇళ్ల ముందు ఉన్న హుస్సెన్‌సాగర్‌లో చెత్త వేయకుండా చూడాలి. మీ ప్రాంతాన్ని మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇళ్ల మెయింటనెన్స్ మీకు భారం కావొద్దని.. ఇక్కడే 26 షట్టర్లు కట్టాం. వాటిని కిరాయికి ఇస్తే.. వచ్చే డబ్బులతో మెయింటనెన్స్ చేస్తాం. ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తే.. డైరెక్ట్ ఇక్కడకు తీసుకొచ్చి మా కేసీఆర్ ఈ ఇళ్లు కట్టించాడని చూపించాలి. ఆడబిడ్డలు బాధ్యత తీసుకొని మీ ప్రాంతాన్ని మంచిగా ఉంచుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు.