
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో బీజేపీని ఓడగొట్టడం, ప్రధాని మోదీని ఎదుర్కోవడం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో సాధ్యం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీ నేతలైన కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వారికే మోదీని ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. శనివారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నచ్చకనే ‘ఇండియా’కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారన్నారు.
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకే మేలు..
దేశంలో బీజేపీని ఆపాలన్నా, ప్రధాని మోదీని ఎదుర్కొవాలన్నా ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్ లాంటి వారితోనే సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, -బీజేపీది ఫెవికాల్ బంధమని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి.. బీజేపీ క్యాండిడేట్ల గెలుపు కోసం ఆ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, బీజేపీకి వేసినట్లేనన్నారు. దేశంలో అత్యంత అట్టర్ ప్లాప్ కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కిషన్ రెడ్డినే అని విమర్శించారు. ఈ ఐదేండ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంటో ప్రజలకు వివరించి, ఈసారి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
హామీలను ఎగ్గొట్టే కుట్ర..
ప్రజలకిచ్చిన హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద రూ.2,500ను పార్లమెంట్ ఎన్నికల్లోపే అందించాలని డిమాండ్ చేశారు. కరెంట్ బిల్లు కట్టొద్దని, సోనియా గాంధీ కడుతుందని ఎన్నికల టైమ్‌లో రేవంత్ చెప్పారని, మరి సోనియా గాంధీ ఈ నెల బిల్లు కట్టిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంతో సరిపడ బస్సుల్లేక సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారన్నారు. టికెట్లు తీసుకుంటున్న పురుషులకు సీట్లు దొరకడం లేదన్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ వల్ల ఆటో డ్రైవర్లు ఆగం అవుతున్నారని పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆటో డ్రైవర్లకు మద్దతుగా కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. ఫోటో: ఆల్ పిక్స్ లో ఉంటాయి.
మైనార్టీలకు మంత్రి పదవి ఏదీ?
ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని కేటీఆర్అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్మీటింగ్లో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బుల్డోజర్ పాలసీతో మైనార్టీల ఆస్తులు, హక్కులను హరిస్తున్నట్టే.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి అదే బుల్డోజర్ పద్ధతి అనుసరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారనే మైనార్టీలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో 1953 తర్వాత మైనార్టీలకు కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఇదే మొదటిసారి. మైనార్టీలను కాంగ్రెస్‌పార్టీ ఓటర్లుగానే చూస్తున్నది” అని కేటీఆర్ అన్నారు. ‘‘ఎన్నికలకు ముందు మైనార్టీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి షబ్బీర్‌అలీ పేరును కాంగ్రెస్ వాడుకుంది. అధికారంలోకి రాగానే ఆయనకు సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుంది. మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవితో సరిపెట్టడం అంటే వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. రేవంత్50 రోజుల పాలనలో మైనార్టీల సంక్షేమంపై ఒక్క రోజు సమీక్షించలేదు” అని మండిపడ్డారు.