
హైదరాబాద్, వెలుగు : మల్లేష్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త (మాజీ జవాను) మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవడం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థాయికి తగదని తెలిపారు. హైదరాబాద్ లోని సెక్రటేరియేట్ మీడియా పాయింట్లో ఆదివారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో సహా తాను హత్యా రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని చెప్పారు. స్థానిక నాయకులు చెప్పగానే వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. తన స్థాయిని తానే కేటీఆర్ తగ్గించుకుంటున్నారన్నారని వెల్లడించారు. ఎన్నికలకు ముందే కుటుంబ, భూతగాదాలతో మల్లేష్ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలిందని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు.