జ్ఞానేష్ రాజీనామా చేయాల్సిందే.. ఒక వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం: కేటీఆర్

జ్ఞానేష్ రాజీనామా చేయాల్సిందే.. ఒక వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం: కేటీఆర్

హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన కేటీఆర్.. భారత రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదన్నారు. ఏ భారతీయ పౌరుడి ఓటు హక్కును కూడా హరించలేరని పేర్కొన్నారు. 

సర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి ఇందుకు ఇంత ఆరాటమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఒక వ్యక్తి ఎలా గొప్ప అని నిలదీశారు. సర్ ప్రక్రియలో అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు.

సర్ ప్రక్రియలో అక్రమాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండీ కూటమి పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోంది. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వరుసగా మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానేష్ కుమార్‎ను పదవి నుంచి తప్పించాల్సిందేనని.. అలాగే సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని విపక్ష కూటమి డిమాండ్ చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ సైతం జ్ఞానేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని పలు నగరాల్లో ప్రొటెస్ట్‎లు చేస్తోంది.