పొగడకుండానే కేసీఆర్ ను మోడీ కాపీ కొట్టారు

పొగడకుండానే కేసీఆర్ ను మోడీ కాపీ కొట్టారు

 పొగడ్త కంటే అనుకరణ గొప్పదని కేంద్రం నిరూపించిందని చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేసిన ‘రైతు బంధు’ పథకాన్ని కేంద్రప్రభుత్వం కాపీకొట్టిందన్నారు. నేరుగా చెప్పకపోయినా… కేసీఆర్ మానస పుత్రికలాంటి పథకాన్ని అనుకరించి… పరోక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్రెడిట్ ఇచ్చారని చెప్పారు. రైతు బంధు పథకం దేశ ప్రజలందరికీ అందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు బంధు పథకానికి పేరు మార్చిందని.. మినీ వెర్షన్ ను పథకం గా అందిస్తోందని చెప్పారు. జై కిసాన్ అంటూ.. రైతులకు లాభం జరగడం సంతోషం కరం అన్నారు. 

కేటీఆర్ ట్వీట్ ను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు. తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టడం ద్వారా… మోడీ కంటే కేసీఆర్ రాజకీయంగా చురుకైనవారనీ.. దూరదృష్టికలవారనీ.. నిరూపించినట్టయిందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి అసలైన ఆలోచనలు, విజన్ లేదని.. దేశంలోని వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చూపించలేక… కేసీఆర్ స్కీమ్ ను కాపీ, పేస్ట్ చేసిందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశాన్ని ముందుండి నడిపించాల్సిన అవసరం వచ్చిందన్నారు అసదుద్దీన్ ఒవైసీ.