మున్సిపాలిటీల బడ్జెట్‌‌లో 10 శాతం గ్రీనరీకే

మున్సిపాలిటీల బడ్జెట్‌‌లో 10 శాతం గ్రీనరీకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రీనరీ, పార్కులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఇందుకు మున్సిపాలిటీ, కార్పొరేషన్ బడ్జెట్‌‌లో 10 శాతం ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం అర్బన్ పార్కులపై ఎమ్మెల్యేలు సుభాష్‌‌రెడ్డి, కేపీ వివేక్‌‌లు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. 2014 కు ముందు రాష్ట్రంలో 24 శాతం గ్రీన్ కవర్ ఉంటే ఇప్పుడు 29 శాతానికి పెరిగిందన్నారు. మహబూబ్‌‌నగర్‌‌లో 2,087 ఎకరాల్లో కేసీఆర్ ఎకో పార్క్ స్టార్ట్‌‌ చేశామని చెప్పారు. హెచ్‌‌ఎండీఏ పరిధిలో 103 , జీహెచ్ ఎంసీ పరిధిలో 587 పార్కులు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లాలో మెగా విజయ డెయిరీ: తలసాని

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాలలో రూ. 250 కోట్లతో మెగా విజయ డెయిరీని నిర్మిస్తున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. భూ సేకరణ పూర్తయిందని, 99 ఏళ్లు లీజుకు తీసుకున్నామని, త్వరలో పనులు స్టార్టవుతాయని చెప్పారు. పాల సేకరణ పెంచేందుకు రూ. 4 ఇన్సెంటివ్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 విజయ డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

భవన నిర్మాణ కార్మికుల కోసం 9 స్కీమ్‌‌లు: మల్లారెడ్డి

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి 9 స్కీమ్‌‌లు అమలు చేస్తున్నామని కార్మిక మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షల 15 వేల 287 మంది కార్మికులు ఉన్నారని, వీరికి రూ.1,512 కోట్లు చెల్లించామన్నారు. లాక్‌‌డౌన్‌‌లో రూ.1,500, 12 కేజీల బియ్యం ఇచ్చామన్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచామన్నారు.

ప్రాజెక్టుల దగ్గర పర్యాటక అభివృద్ధి: శ్రీనివాస్‌‌గౌడ్

రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద రూ.250 కోట్లతో ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్ తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, కొండ పోచమ్మ పెద్ద వాటితో పాటు మధ్య తరహ, చిన్న తరహా ప్రాజెక్టుల వద్ద కూడా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. వరంగల్ జిల్లాలో పాకాల సరస్సును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులకు భృతి హామీపై ఎంఐఎం ఎమ్మెల్యే ప్రశ్న ఉండగా స్పీకర్‌‌ వాయిదా వేశారు. 2013-–20 బడ్జెట్‌‌లో నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయించి గైడ్ లైన్స్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారని, దీనిపై జవాబివ్వాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు కోరారు.