ఒకరిద్దరి చేతుల్లో వ్యవస్థలుంటే ఇట్లనే జరుగుతది.. ఇండిగో సంక్షోభంపై కేటీఆర్

ఒకరిద్దరి చేతుల్లో వ్యవస్థలుంటే ఇట్లనే జరుగుతది.. ఇండిగో సంక్షోభంపై కేటీఆర్
  • పైలెట్ల శ్రమ దోపిడీని ఆపాలని చెప్తే సంక్షోభమే తెచ్చింది: కేటీఆర్​
  • ఒకరిద్దరి చేతుల్లోనే వ్యవస్థలుంటే ఇట్లనే జరుగుతది
  • ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ గుత్తాధిపత్యం పెరుగుతున్నదని, ఇది దేశానికే పెను ప్రమాదం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇండిగో ఉదంతమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇండిగో సంస్థ శ్రమ దోపిడీకి పాల్పడిందని మండిపడ్డారు. ఆ సంస్థలోని అంతర్గత సమస్యలతో 5 రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయన్నారు. ఎయిర్​పోర్టులు.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను తలపించాయని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఇండిగో బేఖాతరు చేసిందని మండిపడ్డారు. చివరికి కేంద్రమే ఇండిగో ఒత్తిడికి తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్​లను అమల్లోకి తెస్తే.. ఇలాంటి అరాచకాలే అన్ని రంగాలకూ విస్తరిస్తాయని విమర్శించారు. తెలంగాణభవన్​లో ట్రేడ్ యూనియన్లతో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

దేశంలో విమానయానం కేవలం ఇండిగో, ఎయిరిండియా (టాటా) చేతుల్లోనే ఉందన్నారు. దీంతో పోటీదారు లేక.. ఆయా సంస్థలు తమకు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పైలెట్ల పనిభారంపై ఏడాది కిందే కేంద్రం కొత్త రూల్స్ తెచ్చినా.. ఆ సంస్థలు పట్టించుకోలేదు. అయినా, కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థలకు ఫైన్ వేసే దమ్ము లేదు. పోర్టులు, సీపోర్టుల వంటివి కొందరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి’’అని కేటీఆర్ అన్నారు.

కుబేరులు ఎక్కువే.. పేదరికమూ ఎక్కువే

ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నది మన దేశంలోనేనని, దానికి సమాంతరంగా అత్యంత పేదరికమూ ఉన్నదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ‘‘మన రాష్ట్రంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులున్నాయంటేనే పేదరికం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరప్, అమెరికా రూపొందించిన చట్టాలను, విధానాలను ఇక్కడ గుడ్డిగా అమలు చేయడం కరెక్ట్​ కాదు. ఇక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో సంస్కరణలు తెస్తున్నరు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాల్సిందే.. అయితే, అందుకు తగ్గట్టు క్వాలిటీ ఆఫ్ డూయింగ్​ బిజినెస్ కూడా ఉండాలి. 4 దశాబ్దాల కింద చైనా జీడీపీ మన జీడీపీ కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు చైనా జీడీపీ 60 ట్రిలియన్ డాలర్లైతే.. మన దేశానిది కేవలం 5 ట్రిలియన్​ డాలర్లేనన్నారు. అక్కడి వాళ్లు చదువులు, స్కిల్స్, అవసరం ఉన్న అంశాలపై దృష్టి పెట్టారు. ఇక్కడ మాత్రం వాడేం తింటున్నడు.. ఏం కులం, ఏం మతం వంటి వాటిపైనే ఫోకస్ పెట్టారు’’అని విమర్శించారు.

లేబర్ కోడ్స్​ను అడ్డుకోవాల్సిందే..

కేంద్రం తెస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను అడ్డుకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం బీఆర్​టీయూ తరఫున పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ‘‘కొత్త కార్మిక చట్టాలను అడ్డుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ఏ కార్మిక సంఘంతోనైనా కలిసి పనిచేస్తాం. లేబర్ కోడ్స్​ను సోనియా గాంధీ వ్యతిరేకించారు. అలాంటిది రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారు? లేబర్ కోడ్స్​ను ఆపేలా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తం’’అని అన్నారు.