కాంగ్రెస్‌‌కు ఓటేస్తే  స్కాములు గ్యారంటీ : కేటీఆర్

కాంగ్రెస్‌‌కు ఓటేస్తే  స్కాములు గ్యారంటీ : కేటీఆర్
  • నల్గొండ కాంగ్రెస్‌‌లో ఒకప్పటి మంత్రులు కంత్రీలు
  • ప్రభుత్వ పని తీరు చూసి ఎంపీ కోమటిరెడ్డి మెదడు దెబ్బతిన్నది
  • మాది బరాబర్ వారసత్వ పార్టీనే..
  • నోటికి ఎంతొస్తే అంత ప్రధాని మాట్లాడుతున్నరని ఫైర్
  • నల్గొండ, సూర్యాపేటలో మంత్రి పర్యటన.. ఐటీ హబ్‌‌ల ప్రారంభం

నల్గొండ/సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు ఓటేస్తే ఆరు స్కీముల సంగతేమోగానీ స్కాములు గ్యారంటీ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 కార్యక్రమాలు పక్కాగా అమలవుతాయి. ఇప్పుడున్న 24 గంటల కరెంట్‌‌కు బదులు 3 గంటల కరెంట్ వస్తది. ఏడాదికో సీఎం మారుతరు. ఆకాశం నుంచి పాతాళం దాకా కుంభకోణాలు గ్యారంటీ’’ అని విమర్శించారు. మూడు గంటల కరెంట్​తో మళ్లీ రైతుల జీవితం అంధకారంలో కూరుకుపోతుందన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య.. ఇలా వీళ్లలో ఎవరు సీఎం అవుతారో కూడా చెప్పలేరన్నారు. బీఆర్ఎస్​లో కేసీఆర్ ఒక్కరే సీఎం అని పేర్కొన్నారు. సోమవారం నల్గొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులకు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ రెండు చోట్ల కొత్తగా నిర్మించిన ఐటీ హబ్‌‌లను కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సభల్లో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డికి ప్రభుత్వ పనితీరు చూసి మైండ్ దెబ్బతిన్నది. 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తున్నదని ఆయన సవాల్ చేశారు. మేమే ఖర్చులు పెట్టుకుని, వాహనాలు పెడ్తం.. నీతో సహా మీ పార్టీలో ఎవరైనా సరే రాష్ట్రంలో ఏ గ్రామానికైనా పోండి. వేలు పెట్టి చూడండి. అప్పుడు దేశానికి పట్టిన దరిద్రం పోతది’’ అని  కేటీఆర్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌‌వి దింపుడు కల్లెం ఆశలు

మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై చీటికిమాటికి చిందులేసే కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘‘ఐటీ మంత్రిగా పనిచేసిన వెంకట్‌‌రెడ్డి.. నల్గొండకు మెడికల్ కాలేజీ, ఐటీ హబ్ తెస్తానని చెప్పిండు. కనీసం ఒక్కరికైనా కంప్యూటర్ కొనిచ్చిండా? నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.1,300 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. వెంకట్‌‌రెడ్డి మాత్రం అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌‌ను రద్దు చేస్తామని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ ఇస్తానని కామెంట్లు చేయడం విడ్డూరంగా ఉంది” అని మండిపడ్డారు. ఏనాడో చచ్చిపోయిన కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశతో అధికారం కోసం ఎదురుచూస్తోందని ఎద్దేవా చేశారు. ముసలి నక్క కాంగ్రెస్‌‌ను నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపలా పెట్టినట్లేనని విమర్శించారు. 

నల్లదనం తెస్తానని తెల్లమొఖం వేశారు 

రాష్ట్రంలో రెండు సార్లు రూ.37 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తే చేయలేదని ప్రధాని మోదీ అనడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘నల్లదనం తెస్తానని చెప్పిన మోదీ.. తెల్లమొఖం వేశారే తప్ప ఇప్పటికీ  ఎవరి అకౌంట్లలోనూ  డబ్బులు జమ చేయలేదు. మోదీ అన్నట్లు తమది బరాబర్ వారసత్వ పార్టీనే.  కుటుంబ పార్టీనే. నాలుగున్నర కోట్ల ప్రజల కుటుంబానికి కేసీఆర్ పెద్దగా ఉండి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు’’ అని చెప్పారు.

సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: హుస్సేన్​సాగర్ వద్ద జరిగిన కార్యక్రమంలో దళితబంధు లబ్ధిదారులకు  సిల్ట్ కార్టింగ్ వాహనాలను కేటీఆర్ పంపిణీ చేశారు. జలమండలి పరిధిలో పనిచేసేందుకు 162 సిల్ట్ కార్ట్ వెహికల్స్​ ను దళితులకు అందించామన్నారు.