
- కాంగ్రెస్ గెలిస్తే -కరెంట్ కొట్లాటలు.. నీళ్ల తిప్పలే
- కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం చల్లగుంటది
- జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ,
మహబూబాబాద్, వెలుగు: కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం చల్లగుంటుందని, -పాత స్కీంలు అమలవుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్లు ఢిల్లీలో ఉంటయ్.. వాళ్లు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దల అనుమతి తీసుకోవాలి. ఆ పార్టీలకు ఓటేసి మళ్లీ ఢిల్లీకి బానిసలమవుదామా? ప్రజల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకునే కేసీఆర్‌కు ఓట్లేద్దామా.. ఓ సారి ఆలోచించండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. 440 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. భూపాలపల్లితోపాటు హనుమకొండ జిల్లా పరకాల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పాత రోజులొస్తయ్. కరెంట్ కోసం కోట్లాటలు.. నీళ్ల కోసం తిప్పలు మొదలైతయ్. కాంగ్రెస్ రాబందుల పార్టీ. ఓటుకు నోటు కేసు ముద్దాయి రేవంత్ రెడ్డి ఇప్పుడే డబ్బుల కోసం టిక్కెట్లు అమ్ముకుంటున్నడు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తడు” అని ఆరోపించారు.
వేరే వాళ్లకు ఓటేయొచ్చునా?
నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని, రెండూ కలిపితే ఆరు తమ లక్కీ నంబర్ అని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ‘‘60 ఏండ్లు అధికారంలో ఉండి తాగునీళ్లు కూడా ఇవ్వకుండా ముసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెసోళ్ల మాటలు వినేందుకు మనకు సిగ్గుండాలి, ఇజ్జత్ అనిపించాలి. రాష్ట్రంలో మొనగాడైన కేసీఆర్, మోసగాళ్లయిన కాంగ్రెసోళ్లకు మధ్య పోటీ జరుగుతున్నది. రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన కేసీఆర్‌ను కాదని, ఇంకో పార్టీ దిక్కు చూసే పాపం చేద్దామా? కేసీఆర్ రాకముందు రైతులకు పెట్టుబడి సాయం ఇద్దామన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికీ రాలేదు. అలాంటప్పుడు రైతులు వేరేటోళ్లకు ఓటేయొచ్చునా?’’ అని ప్రశ్నించారు. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టు కాంగ్రెస్, బీజేపీ లీడర్లు వస్తున్నారని మండిపడ్డారు. ‘‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయితదా? రేపో మాపో అసలైన పులి బయటకి వస్తది’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘‘కేసీఆర్ మొత్తం లెక్కాపత్రం రాసుకుంటున్నారు. ఆయన ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలాంటి నక్కలన్నీ తొర్రల్లోకి పరారైతయి. రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు దొంగ. ఆయనకు బదులు చార్లెస్ శోభరాజ్, దావూద్ ఇబ్రహీంను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చు కదా” అంటూ సెటైర్లు వేశారు.
కాంగ్రెస్‌కు బెంగళూరులో మరో హైకమాండ్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కేసీఆర్ స్థాయి లీడరే లేరని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆర్ సీఎం అవుతారని, కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు సీఎం అవుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెసోళ్లు అడుగుతున్నారు. ఇదివరకు 11 సార్లు చాన్స్ ఇస్తే ఏం చేశారు? ఇప్పుడు ఇస్తామన్న స్కీములను ఎందుకు అమలు చేయలేకపోయారు? కాంగ్రెస్‌కు ఇదివరకు ఢిల్లీలోనే హైకమాండ్ ఉండేది. ఇప్పుడు కొత్తగా బెంగళూరులో మరో హైకమాండ్ వచ్చిందన్నారు. ముందు బెంగుళూరు వెళ్లి అక్కడి లీడర్‌ను ప్రసన్నం చేసుకున్న తర్వాతే ఢిల్లీకి వెళ్తున్నారు” అని దుయ్యబట్టారు. ‘‘రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు సోనియాగాంధీని బలి దేవత అని అన్నడు.. రాహుల్‌ను ముద్ద పప్పు అన్నడు. ఇప్పుడు అదే పార్టీలో చేరి వాళ్లు మంచోళ్లు అంటున్నడు” అని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, ఆ స్కీంల డబ్బులు పెరగాలన్నా కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పెన్షన్ రూ.2,016కు పెరిగిందని, దివ్యాంగులకు రూ.4,016 ఇస్తున్న సర్కారు తెలంగాణ ఒక్కటేనన్నారు. దళిత బంధు లాంటి పథకం పెట్టాలంటే కేసీఆర్‌లాంటి దమ్మున్న నాయకుడి వల్లే అవుతుందన్నారు.
అఖండ విజయం సాధిస్తం : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది తమ పార్టీయే అని తేల్చి చెప్పారు. దక్షిణాదిలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడం ఖాయమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండుసార్లు రాష్ట్ర ప్రజలు తమను ఆశీర్వదించారని, మూడోసారి కూడా పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 3న వచ్చే ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారన్నారు. పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా చేసుకొని మూడోసారి విజయం సాధిస్తారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజావ్యతిరేక శక్తులకు మరోసారి ఓటమి తప్పదని, ప్రజల మద్దతుతో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వంద సీట్లకు పైగా గెలిచి రికార్డులను తిరగరాస్తామన్నారు.