ఎల్బీనగర్ లోని 36 కాలనీల్లో రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం : కేటీఆర్ 

ఎల్బీనగర్ లోని 36 కాలనీల్లో రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం : కేటీఆర్ 

15 ఏండ్ల పోరాటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చూపించింది. ఏండ్ల తరబడి ఆయా కాలనీల్లో నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్యకు చెక్ పడింది. ఎల్బీనగర్ తో పాటు ఆరు నియోజకవర్గాల్లో రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం జీవో.118 తీసుకొచ్చామని మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ లోని 36 కాలనీల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రెగ్యులరైజేషన్ కోసం తెచ్చిన జీవోపై న్యాయపరంగా చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ జీవోతో నగరంలోని మొత్తం 44 కాలనీల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేందుకే మినిమమ్ రిజిస్ట్రేషన్ ఛార్జీ వసూలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. 

ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. 8 ఏండ్ల క్రితం ఎల్బీనగర్ చౌరస్తా ఎట్లా ఉండే..ఇప్పుడు ఎట్లా ఉందో ఒక్కసారి ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 12 వందల కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మించామన్నారు. తాగునీటి కోసం రూ. 400 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారంపై.. సరూర్ నగర్ స్టేడియంలో మన నగరం కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు.