ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం: కేటీఆర్​

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా గట్టిగా పని చేద్దామని బీఆర్​ఎస్​ నేతలకు పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్​ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ నేతలను ఆయన అభినందించారు. సోమవారం తెలంగాణ భవన్​లో కొత్త ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ​ప్రభుత్వం పదేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలను ప్రజలు గుర్తించారని, వాళ్లు ఇంకో పార్టీని గెలిపించినా, బీఆర్ఎస్​కు గౌరవ ప్రదమైన స్థానాలు కట్టబెట్టారని  కేటీఆర్​ అన్నారు.  ‘‘ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతలు అప్పగించారు.

వాటిని సమర్థంగా నిర్వహిద్దాం.  ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల నుంచి మన పార్టీకి సానుకూల స్పందన వస్తున్నది. చాలా మంది ఫోన్, మెసేజ్​ల ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నరు. ఎంతో అభివృద్ధి చేసి, దేశానికే ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్​ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని అనుకోలేదని అంటున్నరు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుందాం” అని పేర్కొన్నారు. అధికార పార్టీగా ఇంతకాలం సెక్రటేరియెట్, ప్రగతి భవన్ ​కేంద్రంగా పని చేసిన మనమంతా ఇకపై తెలంగాణ భవన్​ కేంద్రంగా పని చేద్దామని నేతలకు ఆయన సూచించారు. తాను తెలంగాణ భవన్​లో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. 

ఓడిపోయిన నేతలకు ఓదార్పు

ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నాయకులు భావోద్వేగానికి గురికాగా వారిని కేటీఆర్​ ఓదార్చారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని.. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పాటుపడితే వారే తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు. ఎంత మంచి చేసినా ఎన్నికల్లో ఒక్కోసారి  ఎదురు దెబ్బలు తప్పవని, అంతమాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లో అందుకు దారి తీసిన పరిస్థితులపై కేటీఆర్​ సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగాయో విశ్లేషించి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ‘‘ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండేలా పార్టీ చీఫ్​కేసీఆర్ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ప్రజలకు మనం అత్యంత దగ్గరగా ఉండి పని చేసినా వాళ్లు ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సరిదిద్దుకోవాల్సిందే. వాటిపై అందరితో చర్చిస్తా” అని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు.  సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్​ను మర్యాదపూర్వ్యంగా కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్​హౌస్​కు వెళ్లారు.