ఇది ఎన్నికల టైమ్.. అలర్ట్​గా ఉండండి: కేటీఆర్

ఇది ఎన్నికల టైమ్.. అలర్ట్​గా ఉండండి: కేటీఆర్
  •     ప్రజలకు ఇబ్బందులు రానివ్వొద్దు 
  •     ఎలాంటి ప్రమాదం జరిగినా అధికారులపై చర్యలు తప్పవు: కేటీఆర్​

హైదరాబాద్​, వెలుగు: ఇది ఎన్నికల టైమ్​ అని, పెద్ద వర్షాలొచ్చి జనం ఇబ్బంది పడితే సమస్యేనని మంత్రి కేటీఆర్ అన్నారు. జనానికి ఇబ్బందులు రాకుండా అధికారులందరూ సరిగ్గా పనిచేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రమాదం జరిగినా అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఎప్పటికప్పుడు అలర్ట్​గా ఉండాలని ఆయన అన్నారు. వరదలు వచ్చినా..కంట్రోల్ చేసేలా రెడీగా ఉండాలని సూచించారు.  హైదరాబాద్​లోని వర్షాలు, శానిటేషన్ పై పై జీహెచ్ ఎంసీ అధికారులతో నానక్ రామ్ గూడ లోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆఫీసులో బుధవారం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ‘‘అధిక వర్షం పడితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రానున్న రెండు,మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉంది. జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ లు నిరంతరం సమన్వయం చేసుకోవాలి. వర్షాల వల్ల ప్రాణనష్టం జరగకూడదన్న లక్ష్యంతో పని చేయండి” అని చెప్పారు. నాలాల నిర్మాణ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మంచి ఫలితాలను ఇస్తున్నదని, దీంతోనే  సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్​ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరుగుతుండటంతో చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని కేటీఆర్​ సూచించారు. పారిశుధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, ఇంజినీర్ చీఫ్ జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.