రేవంత్ తెలంగాణవాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి: కేటీఆర్

రేవంత్ తెలంగాణవాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి: కేటీఆర్
  •     అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతే  : కేటీఆర్
  •     నిజామాబాద్​లో మంత్రి పర్యటన.. ముందస్తు అరెస్టులు

నిజామాబాద్, వెలుగు: 50 ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడొచ్చి మళ్లొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మళ్లీ కుంభకోణాల కుంభమేళా చేసే కాంగ్రెస్​కావాల్నో.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్​ కావాల్నో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు. ‘‘తెలంగాణవాదిని అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నడు. కానీ ఆయన తెలంగాణకు పట్టిన వ్యాధి. రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం” అని కామెంట్ చేశారు. 

బుధవారం నిజామాబాద్​లో ఐటీ టవర్ సహా పలు ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం పాలిటెక్నిక్​గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కుసంస్కారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘తన తండ్రి వయసున్న సీఎం కేసీఆర్ పై ఎంపీ అర్వింద్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఆయన సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అర్వింద్​వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా, డిపాజిట్ గల్లంతు చేయాలని నిజామాబాద్​ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎంపీగా నిజామాబాద్ కు ఏం చేయలేదు కాబట్టే.. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు ధర్మపురి అర్వింద్ మొహం చాటేశారు” అని అన్నారు. 

ప్రజలే మాకు బాసులు.. 

ప్రజలే తమకు బాసులు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ ఏం చేయాలన్నా? ఏం మాట్లాడాలన్నా? ఢిల్లీకి వెళ్లి హైకమాండ్​ముందు మోకరిల్లాలి. కానీ కేసీఆర్​ఎవరి ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదు. కాబట్టే  రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత చెప్పడంతో రాష్ట్రంలో  6,700 మంది బీడీ టేకేదార్లకు కూడా పింఛన్లు రాబోతున్నాయి” అని చెప్పారు. ఢిల్లీ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని... వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కష్టపడి పని చేస్తున్నారని, వాళ్లను మరోసారి గెలిపించాలని కోరారు. 

సభకు కాలేజీ స్టూడెంట్ల తరలింపు.. 

మంత్రి కేటీఆర్ సభను సక్సెస్​చేయడానికి నగరంలోని ప్రైవేట్ కాలేజీల స్టుడెంట్స్​ను బీఆర్ఎస్​లీడర్లు తరలించారు. జనం వస్తారో లేదోనన్న అనుమానంతో కాలేజీ మేనేజ్​మెంట్లతో మాట్లాడి స్టూడెంట్లను సభకు రప్పించారు. కాగా, కేటీఆర్​పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేశారు. లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు దేవారాం, సుధాకర్, సురేశ్, మల్లేశ్, కిషన్, మురళి తదితరులను అరెస్టు చేశారు. బోధన్​లో శక్కర్​నగర్​కార్మికుల రిలే దీక్షలను భగ్నం చేశారు. నిజామాబాద్​లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​సూర్యనారాయణ గుప్తాను హౌస్ అరెస్ట్ చేశారు. హాస్టల్ అడ్మిషన్ల కోసం ఆన్​లైన్​అప్లికేషన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్​కు వినతిపత్రం ఇచ్చేందుకు మున్సిపల్​ఆఫీసు వద్దకు వచ్చిన స్టూడెంట్ లీడర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి పర్యటన తర్వాత వారిని వదిలేశారు.