వ్యవసాయ ఉత్పత్తిలో మనం నంబర్ వన్ : కేటీఆర్

వ్యవసాయ ఉత్పత్తిలో మనం నంబర్ వన్ : కేటీఆర్

హైదరాబాద్‌, వెలుగు : వ్యవసాయ, దాని అనుబంధ రంగంలో 2014లో మన రాష్ట్రం24వ స్థానంలో ఉండగా, నేడు నంబర్  వన్​లో నిలిచిందని మంత్రి కేటీఆర్  అన్నారు. ఈ ఘనత కేవలం 9 ఏండ్లలోనే సాధ్యమైందన్నారు. శుక్రవారం నోవోటెల్‌లో ‘అగ్రికల్చరల్‌  డేటా మేనేజ్‌మెంట్‌  ఎక్సేంజ్‌’ ‍వేదికను మంత్రి కేటీఆర్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, రైతుకు ఏం కావాలో ఓ రైతుగా సీఎం కేసీఆర్​కు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా రైతులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. చిన్న, సన్నకారు రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం వల్లే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పనులు లేక ఉపాధి కోసం పాలమూరు బిడ్డలు వలస వెళ్లేవారని, నేడు ఆ ముద్రను శాశ్వతంగా చెరిపివేసి ‘పాలమూరు రైతులు’గా మార్చామన్నారు. ‘‘మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు మా ప్రభుత్వం ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి పర్యావరణ అనుమతులు రావడం గర్వంగా ఉంది. గోదావరి నీటిని సముద్ర మట్టానికి 80 నుంచి 670 మీటర్ల ఎత్తులో నుంచి లిఫ్ట్‌ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద  లిఫ్ట్ ఇరిగేషన్‌  ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచింది” అని మంత్రి పేర్కొన్నారు. ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచితంగా 24 గంటల పాటు కరెంట్  అందిస్తున్నామని కేటీఆర్‌  అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల బోర్లకు  ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. 

అన్నీ రెవల్యూషన్లే

అత్యధిక వరి ఉత్పత్తి ద్వారా ‘గ్రీన్‌ రెవల్యూషన్‌’ సాధించామని కేటీఆర్  అన్నారు. ‘‘మిషన్‌  కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి  మత్స్యకారులకు ఫ్రీగా చేప పిల్లలు అందించి మత్స్య సంపద పెంచి ‘బ్లూ రెవల్యూషన్‌’ సాధించినం. పాడి రైతులకు ప్రోత్సాహకాలు అందించి ‘వైట్‌ రెవల్యూషన్‌’,  కురుమ, గొల్ల సామాజికవర్గాలకు గొరెలు పంపిణీ చేసి మాంసం ఉత్పత్తి పెంచి ‘పింక్‌  రెవల్యూషన్‌’ కలను సాకారం చేశాం” అని పేర్కొన్నారు.