
హైదరాబాద్, వెలుగు: పర్యావరణహిత రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు దక్కడం సీఎం కేసీఆర్ నిబద్ధతతోనే సాధ్యమైందని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) విడుదల చేసిన నివేదికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్దీర్ఘ దృష్టితో హరితహారం చేపట్టడం వల్ల రాష్ట్రంలో గ్రీన్కవర్ (పచ్చదనం) 22 శాతం నుంచి 33 శాతానికి పెరిగిందన్నారు. తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. 2015 -16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కి.మీ.లు ఉంటే ఇప్పుడు 26,969 చదరపు కి.మీకు పెరిగిందన్నారు. హరితహారంతో రాష్ట్రంలో గ్రీన్కవర్ 7.70 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ఇండియా నివేదిక వెల్లడించిందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.