పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే..చిన్న చిన్న సమస్యలు వస్తయ్..

పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే..చిన్న చిన్న సమస్యలు వస్తయ్..
  • పైసా ఖర్చు లేకుండా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయిస్తున్నం: కేటీఆర్
  • కాళేశ్వరంపై ప్రతిపక్షాలది పైశాచిక ఆనందం
  • ఉద్యమకారులకు న్యాయం చేశామని కామెంట్
  •  బీఆర్ఎస్​లో చేరిన దరువు ఎల్లన్న

హైదరాబాద్, వెలుగు: పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే.. చిన్న చిన్న సమస్యలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంపై ప్రతిపక్ష నాయకులది పైశాచిక ఆనందం అని మండిపడ్డారు. గతంలో రెండు పంప్​హౌస్​లు మునిగితే ఇక ప్రాజెక్ట్ పని అయిపోయిందని విమర్శించారని తెలిపారు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్​లో చిన్న సమస్య వస్తే అలాగే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై పైసా భారం పడకుండా బ్యారేజీని నిర్మించిన సంస్థనే.. కొన్ని నెలల్లో రిపేర్ చేసి ఇస్తామని చెప్పిందన్నారు. గతంలో పంప్​హౌస్​లను కూడా ఇలాగే పునరుద్ధరించామని వివరించారు. సోమవారం తెలంగాణ భవన్​లో తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ లీడర్ దరువు ఎల్లన్న బీఆర్ఎస్​లో చేరారు. కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎండాకాలంలో కూడా నర్మాల చెరువు మత్తడి దుంకుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు. కర్నాటకలో రైతులకు ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన డీకే శివకుమార్ పుణ్యాత్ముడు అని ఎద్దేవా చేశారు. 

వేరే రాష్ట్రాల లీడర్లు మనకెందుకు?

తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు చేతగాకనే.. పక్క రాష్ట్రాల లీడర్లను పిలిపించుకుంటున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఉండగా.. వేరే రాష్ట్రాల లీడర్లు మనకు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిజం గడప దాటేలోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తదట.. ఉద్యోగ నియామకాల్లో మనం ఏం చేశామో ప్రజలకు చెప్పాలే.. 2.20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టినం. 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినం. దీన్ని ప్రజలకు చెప్పాలే.. ముఖ్యంగా యువతకు వివరించాలే.. బండి సంజయ్ వెనుకున్న చెంచాగాళ్లు పేపర్ లీక్ చేస్తరు.. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడే కోర్టుకు పోయిండు.. వాయిదా వేస్తే మళ్లీ ఏదో చేశామని వాళ్లే గగ్గోలు పెడ్తరు. నిజాలన్నీ యువతకు చెప్పాలి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం

జాతీయ పార్టీలు చేసిన మోసాన్ని గ్రహించే తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్​లో చేరుతున్నారని కేటీఆర్ అన్నారు. చెరుకు సుధాకర్, దరువు ఎల్లన్న బీఆర్ఎస్​లోకి వచ్చినట్టుగానే ఉద్యమకారులంతా అధికార పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రజా కళాకారుడు రసమయి బాలకిషన్ ఎమ్మెల్యేగా ఉన్నరు.. గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీలుగా చేసుకున్నాం.. విద్యార్థి ఉద్యమకారులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్​లు, కార్పొరేషన్ చైర్మన్​లుగా చాన్స్ ఇచ్చాం.. రేపు దరువు ఎల్లన్న సేవలను ఉపయోగించుకుంటాం’’ అని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే ముందున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టీఎస్​పీఎస్సీలోని లోపాలు సరి చేస్తామని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్.. మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నది

కాంగ్రెస్​పార్టీ.. మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తోందని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మం త్రి కేటీఆర్​ఆరోపించారు. కేసీఆర్​ను మించిన సెక్కులర్ ​నాయకుడు దేశంలోనే లేరని ఆయన అన్నారు. హైదరాబాద్ జలవిహార్​లో సోమవారం నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్​ పాల్గొని మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి దేశంలోనే అత్యధిక బడ్జెట్ ​కేటాయిస్తున్నది, మైనార్టీల కోసం అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్​ మాత్రమేనని కేటీఆర్​ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ​నేత శ్యామ్​ప్రసాద్​ముఖర్జీ మద్దతుతోనే నెహ్రూ ప్రభుత్వం ఏర్పడిం దని, నెహ్రూ ప్రభుత్వంలో ముఖర్జీ మినిస్టర్​గా కూడా పనిచేశారని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ ​గాంధీ ప్రధాన మంత్రులుగా పనిచేసిన కాలంలోనూ ఆర్ఎస్ఎస్​కు సపోర్ట్​ చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ ​నుంచే వచ్చాడని.. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ పంజాబ్ ​మాజీ సీఎం కెప్టెన్ ​అమరీందర్ ​సింగ్ ​సోనియా గాంధీకి లేఖ రాశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్​పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదని, ఇప్పటికీ దేశంలో పేదరికం అత్యధికంగా ఉందన్నారు. 

బీఆర్ఎస్​లోకి నిర్మల్​ బీజేపీ అధ్యక్షురాలు

నిర్మల్​ బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి బీఆర్ఎస్​లో చేరారు. సోమవారం తెలంగాణ భవన్​లో ఆమెకు పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​కేటీఆర్​ కండువా కప్పి బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, మథోల్​ ఎమ్మెల్యే  విఠల్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ​తదితరులు పాల్గొన్నారు. ముథోల్ ​నుంచి 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తనకు కాకుండా మరొకరికి బీజేపీ టికెట్​ఇవ్వడంతో మనస్తాపం చెందిన ఆమె.. కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు.