ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్, రచయితగా మంచి గుర్తింపు పొందిన సీతారాం ఏచూరి రచనల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రచయిత ఉషారాణి ఈ పుస్తకం ద్వారా సీతారాం రచనల గొప్పతనాన్ని తెలియజెప్పారు. కులం, మతతత్వం, సంస్కృతి, కళలు, సాహిత్యం, సైన్స్, క్రీడలు, సంగీతం లాంటి అనేక అంశాలను ఇందులో విశ్లేషించారు. వాటిని గమనిస్తే.. ఆయన పరిశోధనా సామర్థ్యం, రచనల్లో భావుకత మనకు తెలుస్తోంది.
‘ఒక కథనం ఉరికొయ్యకు వేలాడింది’ సీతారాం ఏచూరి రాసిన 70 వ్యాసాల సంకలనాన్ని ఉషారాణి తెలుగులోకి అనువదించారు. ఇది ఆయన రాజకీయ, సామాజిక విశ్లేషణలను, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) నాయకత్వంలో ఆయన పాత్ర, అనుభవాలను వివరిస్తోంది. ఈ పుస్తకంలోని వ్యాసాలు హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరుతో దశాబ్ద కాలం పాటు ప్రచురితమయ్యాయంటే అతిశయోక్తి కాదు.
ఈ వ్యాసాల్లో వైవిధ్యం ఆయన బహుముఖ ప్రజ్ఞకు తార్కాణం. ‘ఆధునిక, లౌకిక, ప్రజాస్వామిక దేశంలో బాబ్రీ మసీదు–- రామ జన్మభూమి లాంటి వివాదాస్పద అంశాలను రాజకీయ సంకల్పంతో పరిష్కరించాలి. అలానే న్యాయవ్యవస్థ అనేది సాక్ష్యాలు, వాస్తవాలు, న్యాయసూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుందే తప్ప విశ్వాసాలు, నమ్మకాల మీద ఆధారపడి తీర్పులు ఇవ్వద’న్నారు. ‘మనం కోరేది పారిశ్రామికీకరణ, ఆశ్రిత పెట్టుబడి కాదు.
మనం మన వ్యవసాయాన్ని, మన రైతుల ప్రయోజనాలను కాపాడుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, వృద్ధిరేటు సాధించేందుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. దీనికి ఉన్న ఏకైక మార్గం దేశీయ డిమాండ్‌ను పెంచుకోవడమే’నని చెప్పారు. ‘కమ్యూనిస్టులు మానవుల స్వేచ్ఛను, విముక్తిని కోరుకుంటారు. అందువల్ల వారు లాభాలకన్నా ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తార’ని కమ్యూనిస్టుల ఆశయాలను, భావాలను నిక్కచ్చిగా వెలిబుచ్చారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతిరాయ్ బ్రిటిష్ పోలీసుల దాడిలో మరణించినప్పుడు.. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌సింగ్ నిర్ణయించుకోవడం.. 1931 మార్చి 24న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీయాలని ప్రభుత్వం ప్రకటించడం.. తర్వాత దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలకు భయపడి ఒకరోజు ముందుగానే ఉరితీయడం.. ఉరిశిక్ష ఖరారైనప్పటికీ ఈ పోరాటం తమతో ఆరంభం కాలేదని, అలాంటిది తమతోనే అంతం కాదని భగత్ సింగ్ చాటిచెప్పడం.. లాంటి విషయాలతో ఆయన వీరగాథను ‘ఒక కథనం ఉరికొయ్యకు వేలాడింది’ వ్యాసంలో చెప్పారు.
‘రకరకాల ఉగ్రవాదాలన్నీ ఒకదానికొకటి పెంచి పోషించుకుని బలపడుతూ దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా చేస్తున్నాయి. ఏ ఉగ్రవాదానికి మతం ఉండదు. దేశం అంటే ప్రజలే అని గుర్తించాలి. ఎందుకంటే ఏ ఉగ్రవాదమైనా మన దేశ ఐక్యతకు, సమగ్రతకు భంగం వాటిల్లేలా చేస్తుంద’ని గుర్తెరిగేలా చేశారు. ఈ సంకలనం ఆయన జీవితంలోని కీలక ఘట్టాలు, రాజకీయ పోరాటాలు, సిద్ధాంతాలకు ప్రతిరూపంగా నిలిచింది. సీతారాం లేకున్నా.. ఆయన ఆలోచనలు, రచనలు ఎప్పటికీ సజీవ సాక్ష్యాలే!
- పి. రాజ్యలక్ష్మి
