మాయా ఏంజిలో అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త. మానవ హక్కుల కోసం పాటుపడిన మహిళ. ఆమె రచనలు అమెరికన్ జాతిని చెప్పలేనంతగా ప్రభావితం చేశాయి. ఆమె వారసత్వాన్ని అందుకుని ఎందరో ఉద్యమకారులయ్యారు. అమెరికన్ ప్రభుత్వం మాయా ఏంజిలో క్వార్టర్ కాయిన్ విడుదల చేసి ఆమెని గౌరవించింది. ఆ నాణెం ఇంకా చలామణిలో ఉంది. అది మాయాకు దక్కాల్సిన గౌరవమే అని అమెరికన్లు, ఆఫ్రికన్లు భావించారు. తన పేరు మీద నాణెం విడుదలైన మొట్టమొదటి నల్లజాతి మహిళ మాయా. ఆమె కవితలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.
‘నేనో ఉప్పెననై..’ still i rise’ అన్న కవిత చాలా ప్రాచుర్యం పొందింది. ఇలాంటి ఎన్నో కవితలు ‘మాయా ఏంజిలో’ కవితా సంపుటిలో మనకు కనిపిస్తాయి. ఈ కవితలన్నీ ‘సంచిక’ వెబ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ కవితలని వారం వారం ప్రచురించినందుకు సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణని, కొల్లారి సోమశంకర్ గారిని అభినందించకుండా ఉండలేం.
సాహిత్యంలో అతి కష్టమైన పని ఏదైనా ఉందంటే అది అనువాదం. అందులో కవిత్వం మరింత కష్టమైన పని. అనువాదకులని సాహిత్యకారులుగా అంతగా గుర్తించరు. నిజానికి అనువాదకులు లేకుంటే ప్రపంచ సాహిత్యాన్ని అంతగా చదవలేం. కథలనైనా, కవిత్వాన్నైనా అనువదించడం ఓ తపస్సు. ప్రపంచ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి, విభిన్న ప్రపంచ దృక్పథాలను తెలుసుకోవడానికి అనువాద ప్రక్రియ ఉపయోగపడుతుంది.
నిజకవితలోని భావోద్వేగాలు కోల్పోకుండా అనువాదం చేయడం కొంత కష్టమైన పని. వివిధ దేశాలలోని జీవన విధానం, పోరాటాలు, సంస్కృతి అనువాద కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చు. అనువాదకులు సాంస్కృతిక వారధులుగా పనిచేస్తారు. మంచి అనువాదం నిజ కవిత్వానికి ప్రతిబింబం కాదు. అదొక కొత్త సృష్టి. మాలభాషలోని భావాన్ని గుర్తించి లక్ష్య భాషలో పునః స్పష్టించడం, అది చదివించే విధంగా అందించడం అనువాదకుల నైపుణ్యం. ఈ సంపుటిలోని కవితలు చదివితే కవయిత్రి హిమజ ఈ విషయంలో విజయం సాధించినట్టు అనిపిస్తుంది. అక్షరాలా పదం పదం అనువాదం కాకుండా మొత్తం కవిత సారాన్ని, సారాంశ సందర్భం తెలియజేయడం పట్ల దృష్టి పెట్టానని కవయిత్రి హిమజ తన మాటల్లో చెప్పుకున్నారు. క్లిష్టంగా తోచినవి వదిలేసి అంటే అనువాదానికి అంతగా లొంగని కవితలని వదిలేసి ఎంపిక చేసుకున్న కవితలను అనువదించినట్టు అనువాదకురాలు చెప్పుకున్నారు.
ఈ సంపుటిలో పిల్లలు, వృద్ధులు, సోదరులు ఇలా కుటుంబ సభ్యుల్లో ఉండే ప్రతి ఒక్కరి గురించే కాకుండా వేశ్యావృత్తి మీద కూడా రాసిన కవితలు ఉన్నాయి. ఎక్కువగా సార్వజనీనత కలిగిన కవితలు మనకు కనిపిస్తాయి. అమ్మ గురించి పాప చెప్పిన కవిత, దాని అనువాదం మనల్ని ఆకట్టుకుంటాయి. అమ్మ గురించి తనకే ఎక్కువ తెలుసని అనుకున్న పాప.. వయసు మీద పడుతున్నప్పుడు ఆమె అభిప్రాయం మారిపోయింది. మొదట్లో పాప ఇలా అంటుంది. ‘నన్ను పట్టుకున్న అమ్మ ఉయ్యాల’ అన్న కవితలో..
నేను నీ నుంచి రూపు దిద్దుకున్నానన్నది నిజం.. నువ్వు నా కోసమేసృజించబడ్డావన్నదీ నిజం అని చెబుతూ కవిత మధ్యలో ఇలా అంటుంది.. "నువ్వు నా ప్రపంచంలోకి తిరిగొచ్చిన ప్రతిసారి నాకు భరోసానిచ్చావు, మెల్లగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది నువ్వనుకుంటావు, నీకు నా గురించి తెలుసని నాకే నీ గురించి బాగా తెలుసు.. నువ్వు నన్ను గమనిస్తున్నావని అనుకుంటావు. నా కళ్లంతా నిన్నే జాగ్రత్తగా నింపుకున్నాన్నేను." ఇలా కవిత్వంలో మాట్లాడిన చిన్నారికి వయసు పెరిగిన తర్వాత అమ్మ గురించి మరింత తెలుస్తుంది. తనకేదీ తెలియదని అర్థమవుతుంది. అమ్మని చదవడం కన్నా తను నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అర్థమవుతుంది. చివరికి ఆ కవితలో ఇలా అంటుంది.
నా స్వార్థపూరిత చర్యల వలన
నా అజ్ఞాతం వలన
నా పెంకితనం వలన
నువ్వు వేసారి పోయి
నన్నో విరిగిపోయి
పనికిరాని బొమ్మని విసిరేసినట్టుగా
నన్ను నీకు దూరం చేయలేదు
నీకు
నాలో ఇంకా
ఆదరణ, ప్రేమ గొప్పతనం
కనిపిస్తున్నందుకు నీకు నా ధన్యవాదాలు
కృతజ్ఞతలు అమ్మా!
నీకు నా అనేకానేక ప్రేమలు తల్లీ!
‘పిల్లవాడిని కొట్టడం చాలా చెడ్డపని’ అన్న కవితా శీర్షిక చాలా పొడుగైనట్టుగా అనిపిస్తుంది. ఆకలి అమాయకత్వం కలగలిసిన పిల్లాడి దుర్భలత్వం, దయనీయ స్థితి ఈ కవితలో కనిపిస్తుంది. విషాదపు ముగింపుతో మనసు కలిచివేస్తుంది.
మానవ కుటుంబం అన్న కవితలో విశ్వ సౌభ్రాతృత్వం కనిపిస్తుంది. అది కూడా అద్భుతంగా.
వర్ణం గురించి ఇలా చెప్తుంది మాయా.
గోధుమ వన్నె, గులాబీ రంగు,
నేరేడు పండు రంగు
ఇసుక రంగు, నీలి శ్వేత వర్ణాలు
వివిధాలైన మన శరీరచ్ఛాయలు
గందరగోళానికి గురిచేస్తాయి
ఆనందాన్నీ ఇస్తాయి.
సప్త సముద్రాల నుంచి పయనించినప్పటికీ.. ప్రతి భూభాగాన్ని చూసినప్పటికీ ఒకే తీరున్న మనిషి కనపడలేదని అంటూ కవితని ఇలా ముగిస్తుంది.
‘స్నేహితులారా..
మనమెంత భిన్నంగా ఉన్నప్పటికీ
మనమెన్ని తేడాలతో ఉన్నప్పటికీ
మనమంతా సమానులమే’
ముందుమాట రాసిన కొల్లూరి సోమశంకర్ గారన్నట్టు ముసలితనంలో తమ స్వాభిమానాన్ని నిలుపుకునే వృద్ధుల మానసిక స్థితిని మాయ హృద్యంగా వర్ణించారు. అంటే హృద్యంగా హిమజ అనువదించారు. ‘ముసలివాళ్ల నవ్వులు’ అనే కవితలో మాయ ఇలా అంటారు.
‘జీవితం వాళ్లకు
ఏమిచ్చినా ఇవ్వకున్నా
మౌనంగా అంగీకరించి
ఉదారంగా క్షమిస్తున్నారేమో!!’
మాయా ఏంజిలో 2014 మే 28న ఉత్తర కరోలినా విస్టన్ సేలమ్‌లోని తన ఇంట్లో గుండె సంబంధిత సమస్యల వల్ల మరణించారు. అప్పుడు ఆమె వయసు 86 సంవత్సరాలు. ఈ పుస్తకంలోని చివరి కవిత ‘still i rise’ నేనో ఉప్పెననై.. చాలా గొప్పకవిత. మాయ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఈ కవిత ముందు వరుసలో ఉంటుంది. అలాంటిదే మరో కవిత ‘పిచ్చిపిల్ల’. తొలిరోజుల్లో తనని తాను పోషించుకోవడానికి పడుపు వృత్తిని చేపట్టినా, తాను తప్పు చేసినట్టుగా ఎప్పుడూ ఉండలేదు మాయా. still i rise అన్న కవితలో ఇలా అంటుంది.
నేను నల్ల సముద్రాన్ని
నా వేదనలు నా దుఃఖాలు
అగాధపు లోతుల్లోకి
ప్రవహించిపోతాయి
భయానక, దయారహిత రాతలని
ధిక్కరించి
నేను ఉప్పెననై ఎగిసిపడతాను
ఓ గొప్ప ఆత్మ విశ్వాసాన్ని కలిగించే కవితలు ఇందులో ఎన్నో. అశాంతి ఆందోళనలు ఎన్ని కలిగినా చివరికి ఈ కవితలు చదివినవాళ్లు నిబ్బరంగా పైకి లేస్తారు. ముందుమాట చదివితే ఈ అనువాదంలోని నైపుణ్యత మనకు కనిపిస్తుంది. మంచి అనువాద కవిత్వం అందించిన హిమజకి అభినందనలు.
ఇంగ్లిష్ నుంచి తెలుగులోకే కాకుండా విరివిగా తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది అనువాద కవిత్వంలా లేదు. తెలుగు కవిత్వం మాదిరిగా ఉంది. ఇవి ప్రచురించిన సంచిక వెబ్ జర్నల్‌కి మరోమారు అభినందనలు.
-డా. మంగారి రాజేందర్,
కవి, రచయిత
9440483001
