4 లక్షల ఏండ్ల క్రితమే నిప్పు రాజేశారు! మానవ మనగడకు సంబంధించి వెలుగులోకి మరో ఆధారం

4 లక్షల ఏండ్ల క్రితమే నిప్పు రాజేశారు! మానవ మనగడకు సంబంధించి వెలుగులోకి మరో ఆధారం

మనిషి కృత్రిమంగా నిప్పు పుట్టించడం నేర్చుకున్న తర్వాతే వండడం నేర్చుకున్నాడు. అప్పటినుంచే అభివృద్ధి మొదలైంది. అయితే.. ఇప్పటివరకు ఉన్న ఆధారాల ప్రకారం మనిషి యాభై వేల ఏండ్ల క్రితం ప్రస్తుత ఫ్రాన్స్‌‌లో మొదటిసారి నిప్పుని పుట్టించినట్టు చరిత్ర చెప్తోంది. కానీ.. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో భూమిపై 4 లక్షల ఏండ్ల క్రితమే మనుషులు నిప్పు రాజేశారని తేలింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను పరిశోధకులు బ్రిటన్‌‌లోని సఫోక్ కౌంటీలో ఉన్న బర్న్‌‌హామ్ గ్రామంలో కనుగొన్నారు. 

ఈ ప్రాంతంలో చెకుముకిరాయితో కొట్టినప్పుడు స్పార్క్‌‌ను ఉత్పత్తి చేసే ఖనిజం ‘ఐరన్‌‌ పైరైట్’ శకలాలు రెండు దొరికాయి. అవి దాదాపు 4 లక్షల ఏండ్ల నాటివని తేలింది. ఇవి లభించిన ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ఎక్కడా పైరైట్ సహజంగా దొరకదు. ఆ ప్లేస్‌‌కి 40 మైళ్ల దూరంలో ఒకచోట పైరైట్ నిక్షేపాలు ఉన్నాయి. అంటే, పురాతన మానవులు దీన్ని ప్రత్యేకంగా నిప్పు రాజేయడానికే ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. 

అంతేకాదు.. ఈ ప్రాంతంలో వేడి వల్ల రంగు మారిన ఎర్రని మట్టి, వేడికి పగిలిన రాళ్లు, బూడిద ఆనవాళ్లు దొరికాయి. అంటే మాంసాన్ని వండుకోవడం, క్రూర మృగాల నుంచి రక్షణ, సామాజిక కూడికలు... ఇలా ఏదో ఒక బలమైన అవసరం కోసం ఇక్కడ మంట పెట్టి ఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రారంభ మానవ పూర్వీకులైన హోమో హైడెల్‌‌బెర్గెన్సిస్‌‌ల్లోని వేటగాళ్ల శిబిరమై ఉండొచ్చని చెప్తున్నారు.