జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు పాత రిజర్వేషన్లే

జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు పాత రిజర్వేషన్లే
  • పాత రిజర్వేషన్లే.. 85% మొక్కలు బతక్కపోతే కార్పొరేటర్​ పదవి ఔట్
  • స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డీజీ అధికారాలకు కత్తెర
  • బెయిల్‌ రూల్స్​లో మార్పులు
  • అసెంబ్లీలో నాలుగు యాక్టులకు సవరణలు

హైదరాబాద్‌‌, వెలుగుగ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ చట్టం సహా నాలుగు చట్టాల సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంగళవారం వీటి కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌‌ తరఫున మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి నాలా కన్వర్షన్‌‌ యాక్ట్‌‌, స్టాంప్స్‌‌ అండ్‌‌ రిజిస్ట్రేషన్స్‌‌ యాక్ట్‌‌ లకు సవరణలు ప్రతిపాదించారు. మంత్రి కేటీఆర్‌‌ జీహెచ్‌‌ఎంసీ యాక్ట్‌‌కు ఐదు సవరణలు ప్రతిపాదించారు. మంత్రి ఇంద్రకరణ్‌‌రెడ్డి సీఆర్పీసీ చట్టంలోని బెయిల్​ నిబంధనలు మార్చే బిల్లును ప్రవేశపెట్టారు. సీఆర్పీసీ యాక్ట్‌‌పై పెద్దగా చర్చ లేకుండానే సభ ఓకే చేసింది. మిగతా మూడు సవరణలపై సభ్యులు చర్చించాక ఆమోదం తెలిపింది. తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి ప్రకటించారు. ఇవే బిల్లులను బుధవారం కౌన్సిల్‌‌లో ఆమోదించనున్నారు.

జీహెచ్‌‌ఎంసీలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు

జీహెచ్‌‌ఎంసీలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కొనసాగుతాయని మంత్రి కేటీఆర్‌‌ ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రిజర్వేషన్లను తగ్గించలేదన్నారు. దీనిపై భట్టి స్పందిస్తూ.. సభలో మంత్రి ఆన్‌‌ రికార్డుగా బీసీల రిజర్వేషన్‌‌లపై మాటిచ్చారని, అమలు చేసి తీరాలని కోరారు. ఇక 2015 జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో ప్రత్యేక జీవో ద్వారా మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించామని, ఇప్పుడు సవరణ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల తరహాలోనే జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల రిజర్వేషన్లలో మార్పులు చేస్తున్నామని కేటీఆర్‌‌‌‌ ప్రకటించారు. ఒకసారి ప్రకటించే రిజర్వేషన్లు రెండు టర్మ్‌‌‌‌లకు వర్తిస్తాయని, 2015 జీహెచ్ఎంసీ రిజర్వేషన్లే ఈసారి కూడా అమలవుతాయని తెలిపారు. 2025లో చేసే రిజర్వేషన్లు ఆ తర్వాతి ఎన్నికలకు వర్తిస్తాయని చెప్పారు. మాటిమాటికీ రిజర్వేషన్లు మార్చడంతో ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం లేకుండా పోతోందని కామెంట్​ చేశారు. సర్కారు సూచనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్​ పరిగణనలోకి తీసుకొని
ఎలక్షన్​ తేదీ ప్రకటిస్తుందని తెలిపారు.

మొక్కలు బతక్కపోతే పదవి ఔట్‌‌‌‌

డివిజన్లలో నాటిన మొక్కల్లో 85% బతకకుంటే కార్పొరేటర్‌‌‌‌ పదవి పోతుందని కేటీఆర్​ హెచ్చరించారు. జీహెచ్‌‌‌‌ఎంసీ యాక్ట్‌‌‌‌లో ఈ మేరకు సవరణలు చేస్తున్నామని ప్రకటించారు. మొక్కలను బతికించే బాధ్యత కార్పొరేటర్లు, జోనల్‌‌‌‌ కమిషనర్లు, మున్సిపల్‌‌‌‌ అధికారులదేనని తేల్చిచెప్పారు. కార్పొరేటర్‌‌‌‌తోపాటు అధికారులపైనా చర్యలుంటాయని చెప్పారు. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌ కవర్‌‌‌‌ పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే 10% బడ్జెట్‌‌‌‌ను గ్రీన్‌‌‌‌ కవర్‌‌‌‌ పెంచడానికి కేటాయిస్తూ సవరణ చేస్తున్నామన్నారు.

ప్రతి డివిజన్‌‌‌‌లో నాలుగు కమిటీలు

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఒక్కో డివిజన్‌‌‌‌లో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టంలో మరో సవరణ ప్రతిపాదించారు. యూత్‌‌‌‌, మహిళా, సీనియర్‌‌‌‌ సిటిజన్‌‌‌‌, ఎమినెంట్‌‌‌‌ సిటిజన్‌‌‌‌ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. ఒక్కో కమిటీలో 25 మంది సభ్యులు ఉంటారని మంత్రి కేటీఆర్​ తెలిపారు. వారిలో సగం మంది మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఆయా అంశాల్లో కృషి చేస్తున్న ఎన్జీవోలు, స్థానిక డివిజన్‌‌‌‌ కమిటీలకు బాధ్యులుగా ఉన్న వారిని ఈ కమిటీల్లో మెంబర్లుగా నియమిస్తామని చెప్పారు. ఈ కమిటీలు మూడు నెలలకోసారి సమావేశమై తమ సలహాలు, సూచనలు తెలియజేస్తాయని.. వాటిని కౌన్సిల్‌‌‌‌లో చర్చించి మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించారు. డివిజన్‌‌‌‌ కమిటీలు సలహాలు, సూచనలు ఇచ్చే వ్యవస్థ మాత్రమేనని.. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్‌‌‌‌ అధికారాలకు వారు ప్రత్యామ్నాయం కాబోరని తేల్చిచెప్పారు.

నాలా కన్వర్షన్‌‌‌‌ పవర్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌కు..

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే అధికారాన్ని ఆర్డీవో నుంచి తహసీల్దార్‌‌‌‌కు బదిలీ చేస్తున్నారు. ఈ సవరణను అసెంబ్లీ ఆమోదించింది. నాలా చట్టం 2006ను ధరణి పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020కి అనుగుణంగా మార్చనున్నట్టు మంత్రి ప్రశాంత్‌‌‌‌రెడ్డి సభలో ప్రకటించారు. నాలా కన్వర్షన్‌‌‌‌లో అధికారుల ప్రమేయంతో అవినీతి జరుగుతోందని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇకపై ధరణి పోర్టల్‌‌‌‌ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకుంటే ఆటోమేటిగ్గా కన్వర్షన్‌‌‌‌ జరుగుతుందని తెలిపారు. అప్లై చేసుకునే టైంలోనే సీరియల్‌‌‌‌ నంబర్‌‌‌‌ వస్తుందని, ఏ రోజు కన్వర్షన్‌‌‌‌ జరుగుతుందో కూడా తెలిసిపోతుందని చెప్పారు.

స్టాంప్స్‌‌ డీజీ పవర్స్‌‌ కట్

రిజిస్ట్రేషన్‌‌ టైంలో స్టాంపు డ్యూటీ నుంచి మినహాయింపునిచ్చే అధికారాన్ని స్టాంప్స్‌‌ అండ్‌‌ రిజిస్ట్రేషన్స్‌‌ డీజీకు తొలగించారు. భారతీయ స్టాంప్స్​ చట్టం-1899 సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల డాక్యుమెంట్ల విషయంలో ఈ మినహాయింపు వర్తించదని మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి ప్రకటించారు. చట్టంలోని 47-ఎ ప్రకారం స్టాంప్స్‌‌ డీజీలకు కల్పించిన ఈ అధికారంతో అవకతవకలు జరుగుతున్నందున తొలగిస్తున్నామన్నారు. సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ వద్ద ఉన్న మార్కెట్‌‌ వాల్యూ ఎక్కువగా అనిపించినప్పుడు కలెక్టర్‌‌ నేతృత్వంలోని కమిటీకి కొనుగోలుదారులు అప్పీల్‌‌ చేసుకునే చాన్స్‌‌ ఇస్తున్నామని చెప్పారు