- అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, వెలుగు : వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు తాగునీటి కష్టాలు కలగకుండా చూడాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.శుక్రవారం సచివాలయంలో మిషన్ భగీరథ పనితీరుపై ఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నీటి నిల్వలు, పంపిణీ వ్యవస్థపై అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లు, సోర్స్ పాయింట్ల వద్ద తగినంత నీరు ఉందని, ప్రస్తుతానికి తాగునీటి కొరత తలెత్తే అవకాశం లేదని అధికారులు మంత్రికి వివరించారు. సమ్మర్ స్పెషల్ డ్రైవ్ విజయవంతం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా సాఫీగా సాగుతోందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు నేరుగా సర్పంచులతో మాట్లాడినట్లు చెప్పారు. నీటి సరఫరాపై ఇప్పటివరకు 90 శాతం మంది సర్పంచులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించారు.
బోర్లు, బావులు తవ్వించాలి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.."మిషన్ భగీరథ నీళ్లు అందని మారుమూల గ్రామాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజలు బావుల కోసం అడుగుతున్నారు. అలాంటి చోట్ల వెంటనే బోర్లు, బావులు తవ్వించాలి. వాటర్ పైపులైన్లకు ఏవైనా రిపేర్లు చేయాల్సి వస్తే ఆయా గ్రామస్తులకు ముందే సమాచారం ఇవ్వాలి.
ముందస్తు సమాచారం లేకుండా సరఫరా నిలిపివేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఉపాధి హామీ పథకం కింద చెరువులు, కుంటలు తవ్వి భూగర్భ జలమట్టాలను పెంచాలి. ప్రతి గ్రామానికి నిరంతరాయంగా నీరు అందించడమే మన ప్రభుత్వ లక్ష్యం" అని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
