LPG, CNG, LNG, PNG రకాల గ్యాస్‌లు ఏమిటి? దేనిని ఎందుకు వాడతారో తెలుసా..?

LPG, CNG, LNG, PNG రకాల గ్యాస్‌లు ఏమిటి? దేనిని ఎందుకు వాడతారో తెలుసా..?

గ్యాస్ అనగానే మనకు వంట గదిలో వాడే సిలిండర్ మాత్రమే గుర్తొస్తుంది చాలా మంది సామాన్య ప్రజలకు. కానీ పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తిలో వేర్వేరు లక్షణాలు కలిగిన నాలుగు రకాల గ్యాస్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. అవే LPG, CNG, LNG, PNG. వీటి మధ్య ఉన్న తేడాలు, వాటి రసాయనిక నిర్మాణం, ఉపయోగాలతో పాటు ఏ అవసరాలకు దేనిని వాడతారనే ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

LPG : లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్
మనం ఇళ్లలో వంట కోసం వాడే సిలిండర్లలో ఉండేదే ఈ ఎల్‌పీజీ. ఇది ప్రధానంగా ప్రొపేన్, బ్యూటేన్ ల మిశ్రమం. ఆయిల్ రిఫైనరీల నుండి ఇది ఒక ఉప ఉత్పత్తిగా వస్తుంది. దీనిని సాధారణ ఉష్ణోగ్రత వద్దే స్వల్ప పీడనాన్ని ఉపయోగించి లిక్విడ్ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. ఇది గాలి కంటే బరువైనది. కాబట్టి లీక్ అయితే నేలపైనే పేరుకుపోతుంది. గృహ అవసరాలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు, కొన్ని రకాల వాహనాల్లో ఇంధనంగా దీనిని వాడుతుంటారు.

CNG : కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్
సీఎన్‌జీ అనేది పర్యావరణ హితమైన ఇంధనం. దీనిలో 90 శాతం కంటే ఎక్కువ మీథేన్ ఉంటుంది. భూమి పొరల్లో లభించే సహజ వాయువును భారీ పీడనం (200-250 బార్) వద్ద కుదించి సిలిండర్లలో నింపుతారు. ఇది గాలి కంటే తేలికైనది. కాబట్టి లీక్ అయితే త్వరగా గాలిలో కలిసిపోతుంది. దీనిని ప్రధానంగా బస్సులు, ఆటోలు, కార్లలో.. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయడం వల్ల నగరాల్లో దీని వినియోగం ప్రస్తుతం పెరుగుతోంది.

LNG : లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్
నేచురల్ గ్యాస్ సుదూర ప్రాంతాలకు, సముద్ర మార్గాల ద్వారా రవాణా చేయడానికి వీలుగా దీనిని ద్రవ రూపంలోకి మారుస్తారు. మీథేన్ ప్రధానాంశంగా ఉండే ఈ గ్యాస్‌ను -161°C అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ద్వారా లిక్విడ్ గా మారుస్తారు. ఇలా చేయడం వల్ల వాయు రూపంలో ఉన్న గ్యాస్ పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల రవాణా సులభతరం అవుతుంది. దీనిని భారీ పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లు, ఎరువుల తయారీ రంగాల్లో ముడిసరుకుగా ఉపయోగిస్తారు. 

PNG : పైప్డ్ నేచురల్ గ్యాస్
పీఎన్‌జీ అంటే పైపుల ద్వారా నేరుగా వినియోగదారులకు చేరే సహజ వాయువు. దీని రసాయనిక నిర్మాణం కూడా సీఎన్‌జీ లాగే ప్రధానంగా మీథేన్ తో ఉంటుంది. అయితే దీనిని సిలిండర్లలో నింపకుండా తక్కువ ప్రెషర్ తో పైపుల ద్వారా ఇళ్లకు, హోటళ్లకు, ఇండస్ట్రీలకు సరఫరా చేస్తారు. పద్దాకా సిలిండర్లను మార్చాల్సిన అవసరం లేకపోవడం, నిరంతర సరఫరా ఉండటం దీని ప్రత్యేకత. పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్ అవసరాల కోసం ఎల్‌పీజీ స్థానంలో ఇప్పుడు పీఎన్‌జీ వేగంగా విస్తరిస్తోంది.